TTD Laddu: సుప్రీం తీర్పు పట్ల హర్షం : సిపిఐ(యం)

ప్రజాశక్తి-విజయవాడ: టిటిడి లడ్డులో కల్తీపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ను విస్తరించి ఉన్నతస్థాయి విచారణ కమిటీని సుప్రీం కోర్టు నియమించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అయితే సిబిఐ అజమాయిషీలో కాకుండా సిట్‌ విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు నేరుగా సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని కోరింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కేంద్రం జోక్యాన్ని కోరడాన్ని బట్టి టిటిడిని తన పరిధిలోకి తీసుకొని పెత్తనం చేయాలనుకుంటున్నట్లు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. టిటిడిని హైజాక్‌ చేయాలనుకునే బిజెపి, కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. లడ్డులో అవినీతిని బయటపెట్టేందుకు సిట్‌ విచారణలో ఎవరూ జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా పనిచేసే విధంగా కోర్టు చూడాలని తెలిపింది.
గత వారం ఇదే కేసులో సుప్రీం బెంచ్‌ చేసిన వ్యాఖ్యలు పాలక కూటమికి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. మతాన్ని రాజకీయాల్లోకి లాగడాన్ని సుప్రీం కోర్టు గట్టిగా వ్యతిరేకించిందన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు విచారణ పూర్తయ్యేంత వరకు సంయమనం పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని సిపిఐ(యం) కోరింది.
➡️