- ఎమ్మెల్సీ జకియా ఖానం సహా ముగ్గురిపై కేసు నమోదు
ప్రజాశక్తి- తిరుమల : విఐపి బ్రేక్ దర్శన టికెట్లను బ్లాక్‌లో అమ్మినట్లు వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానంతో సహా ముగ్గురిపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై ఆరుగురు భక్తులు టికెట్లు పొందారు. ఇందుకోసం ఎమ్మెల్సీ తరఫున చంద్రశేఖర్ అనే వ్యక్తి రూ.65 వేలు తమ వద్ద వసూలు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దీనిపై టిటిడి విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ జరిపారు. ఇది వాస్తవమేనని నిర్ధారణ కావడంతో వారు తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు చంద్రశేఖర్‌పైనా, ఎమ్మెల్సీ జకియా ఖానంపైనా, ఎమ్మెల్సీ పిఆర్‌ఒ కృష్ణతేజపైనా కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఘటన వెనుక రాజకీయ కోణం : ఎమ్మెల్సీ
ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఎమ్మెల్సీ జకియా ఖానం తెలిపారు. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉందని ఆ రోపించారు. శశి కుమార్ గానీ, చంద్రశేఖర్‌గానీ ఎవరో తనకు తెలియదని తెలి పారు.
ప్రస్తుతం తనకు పిఆర్‌ఒ లు ఎవరూ లేరని, ఇంతకు ముందున్న పిఆర్‌ఒ భక్తులకు సరిగా స్పందించక పోవడంతో తీసివేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పిఎనే అన్నీ చూసుకుంటున్నారని, స్నేహితులకు మాత్రమే సిఫార్స్ లెటర్లు ఇస్తున్నానని తెలిపారు. పార్టీ మారడం తప్పు కాదని, ముఖ్యమంత్రులే అవసరాన్ని బట్టి పార్టీలు మారుతున్నారని పేర్కొన్నారు.
ఆమె వైసిపిలో లేరు : బొత్స
ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైసిపిలో లేరని శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. సాధారణ ఎన్నికల తర్వాత ఆమె టిడిపికి వెళ్లారని చెప్పారు. మంత్రి లోకేష్‌తో పలుమార్టు ఆమె భేటీ అయ్యారన్నారు. మీడియాతో బొత్స మాట్లాడుతూ తిరుమలలో విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన ఆరోపణలతో వైసిపికి సంబంధం లేదన్నారు.