రూపాయి పతనం ప్రమాదకరం : తులసి రెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె : ప్రపంచ మార్కెట్లో రోజు రోజుకి రూపాయికి విలువ లేకుండా పోతుండంతో చాలా ప్రమాదకరమని పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాజాగా డాలరుతో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేని విధంగా రూ 86కు పడిపోయిందని చెప్పారు. దేశ చరిత్రలోనే ఇది అత్యంత కనిష్ట స్థాయి అన్నారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఒక అమెరికన్ డాలర్ విలువ రూ 62.33 ఉండేదని చెప్పారు. ఆనాడు మోఢీ తో పాటు బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శలు చేయడం జరిగిందని చెప్పారు. బిజెపి అధికారంలోకి వస్తే రూపాయిని బలోపేతం చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పారు. కాని బిజెపి అధికారం లోకి వచ్చాక రూపాయి విలువ మరింత పతనమైందని చెప్పారు. ఈ పతనం ఇంతటితో ఆగేటట్లు కనిపించడం లేదన్నారు. మరింత పతనమయ్యేటట్లు కనిపిస్తున్నదని చెప్పారు. దీనివలన దిగుమతులు, వాణిజ్య చెల్లింపులు, విదేశీ అప్పు చెల్లింపులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. విదేశీ మారక నిల్వలు హరించుకు పోతాయాని తెలిపారు.  ప్రస్తుతం మన వద్ద 635 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు వున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటుందని చెప్పారు. రూపాయి మరింత పతనం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తులసిరెడ్డి చెప్పారు.

➡️