కాల్‌మనీ కేసులో ఇద్దరు అరెస్టు

Oct 8,2024 08:08 #Calmoney case, #two arrested
  • మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏలూరు నగరంలో కాల్‌ మనీ కేసులో ఒకటో పట్టణ పోలీసులు నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏలూరు డిఎస్‌పి శ్రావణ్‌కుమార్‌ సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కాల్‌మనీ వేధింపులకు గురైన బాధితురాలు సుబ్బలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుబ్బలక్ష్మి భర్త పౌరోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో 2011లో మేడపాటి సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద 2019లో రూ.1.20 లక్షలు తీసుకుని వారానికి రూ.మూడు వేల చొప్పున మొత్తం రూ.ఆరు లక్షలను ఫోన్‌పే ద్వారా చెల్లించారు. అయినా, ఇంకా రూ.6.50 లక్షలు వడ్డీ చెల్లించాలని సుధాకర్‌రెడ్డి వేధిస్తున్నాడని, ఖాళీ నోట్లపై, చెక్కులపై సంతకాలు చేయించుకుని కోర్టులో కేసులు నమోదు చేశారని, ఇంట్లో సామగ్రి అక్రమంగా పట్టుకుపోయారని, కుటుంబ సభ్యులను, మహిళలను చంపేస్తామని బెదిరిస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో సుబ్బలక్ష్మి పేర్కొన్నారు. దీంతో, సుధాకర్‌రెడ్డి, ఆయన భార్య లావణ్య, వారి అనుచరులు విద్యాసాగర్‌, రాజేష్‌, మహమ్మద్‌ షకిల్‌ రెహమాన్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాసాగర్‌, మహమ్మద్‌ షకిల్‌ రెహమాన్‌లను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న వారి బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశామని, వారి ఖాతాలో రూ.48 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించామని డిఎస్‌పి తెలిపారు. సుధాకర్‌రెడ్డి బాధితులు 58 మంది ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. పలు ప్రాంతాల నుంచి ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

➡️