ఒకరిని కాపాడబోయి మరొకరు.. విద్యుదాఘాతంలో ఇద్దరు మృతి

Jun 11,2024 20:40 #electrocution, #Two died

ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా):విద్యుదాఘాతానికి గురైన ఒకరిని కాపాడబోయి మరొకరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మండల పరిధిలోని ఇబ్రహీంపేట ఎస్‌సి కాలనీకి చెందిన కోనేటి గంగమ్మ (65) తన ఇంటిలోని ఫ్రిడ్జ్‌ తెరిచేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురవ్వడంతో ఆమె గట్టిగా అరిచారు. పక్కింట్లో ఉండే కొండయ్య (51) ఆమెను కాపాడబోయి తాను విద్యుదాఘాతానికి గురయ్యారు. గంగమ్మ అక్కడికక్కడే మరణించారు. కొండయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గంగమ్మ ఒంటిమిట్ట సిపిఎం మండల కార్యదర్శి కోనేటి నరసయ్య తల్లి. గ్రామంలో తరచూ విద్యుత్‌ లో, హై ఓల్టేజీ సమస్య ఉందని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఘటనకు విద్యుత్‌ అధికారులు బాధ్యత వహించి ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా చంద్రశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. నరసయ్య కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

➡️