ప్రజాశక్తి- గంపలగూడెం (ఎన్‌టిఆర్ జిల్లా) :ఎన్‌టిఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుములంకలో కిడ్నీ వ్యాధితో మరణాలు ఆగడం లేదు. గ్రామంలోని దళితవాడకు చెందిన ఇద్దరు ఈ వ్యాధితో ఆదివారం మృతి చెందారు. వారిలో కనకపూడి భారతి (58), కనకపూడి దాస్ (52) ఉన్నారు. కొంతకాలంగా వారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నా ప్రయోజనం లేకపోయింది. కూలి పనులు చేసుకొని బతుకున్న వారిని కిడ్నీ వ్యాధి కబళించింది. దాసుకు భార్య, ముగ్గురు పిల్లలు, భారతికి భర్త, ఒక కుమారుడు ఉన్నారు. వీరి మృతదేహాలను ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిరెడ్డి వెంకట్‌రెడ్డి, పలువురు గ్రామ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ మరణాలు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో 25 మందికిపైగా ఈ వ్యాధితో మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కృష్ణా నది నుండి నీటిని పైపులైన్ ద్వారా తెచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని, కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా చూస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. దీంతో, సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు పలుమార్లు ఉద్యమించారు. తాత్కాలిక వైద్యమే తప్ప, శాశ్వత పరిష్కారానికి పాలకులు కఅషి చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధి నివారణకు వెంటనే శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
