ప్రజాశక్తి- గార్లదిన్నె, ఆస్పరి : అప్పుల బాధ తాళలేక గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రైతు ఓబులేసు(28) తనకున్న మూడు ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. సాగు కోసం రూ.ఆరు లక్షల వరకు అప్పులు చేశారు. గత రెండేళ్లుగా పంటలు చేతికందకపోవడంతో అప్పుల భారం అధికమైంది. ఈ ఏడాది కూడా పంట దక్కకపోవడంతో మరింత భారం పెరిగింది. అప్పులు తీరేదారి లేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన రైతు మనీ సుంకన్న (38) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగు చేశారు. ఇందు నిమిత్తం రూ. ఆరు లక్షలు అప్పు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పంటలు చేతికందకపోవడం, దక్కిన పంటకు సరైన ధర లేకపోవడంతో అప్పులకు వడ్డీ భారం అధికమైంది. రుణదాతల ఒత్తిడి, అప్పులు తీరే దారిలేకపోవడంతో తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
