ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో పెన్నానది పరివాహక ప్రాంతంలోని నీటిగుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… సంచార జాతులకు చెందిన ఓ కుటుంబం కల్లూరులో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన ఆవులకు మేత కోసం సమీపంలోకి గుట్ట వద్దకు అరుణి (9), లక్ష్మి (13) తోలుకెళ్లారు. నీరు తాగడానికి సమీపంలో ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతమైన నీటి గుంత వద్దకు ఆవులు వెళ్లాయి. నీటి గుంతలోకి ఆవులు దిగుతుండగా వాటిని నివారించే ప్రయత్నంలో అరుణి, లక్ష్మి నీటిగుంతలోకి దిగారు. అయితే గుంత లోతు ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ నీట మునిగిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వారి వచ్చి రక్షించేలోపు చిన్నారులిద్దరూ ఊపిరాడక మరణించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
