వెల్డింగ్‌ చేస్తుండగా పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌.. ఇద్దరు మృతి

Apr 1,2024 17:05 #2 death, #Fire Accident, #Kakinada

ప్రజాశక్తి – శంఖవరం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారులో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరమ్మతుల్లో భాగంగా ట్యాంకర్‌కు వెల్డింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఖాళీ గ్యాస్‌ ట్యాంకర్‌ను మరమ్మతుల నిమిత్తం కత్తిపూడికి తీసుకొచ్చారు. మరమ్మతుల్లో భాగంగా ట్యాంకర్‌పైకి వెల్డర్‌ సోమయాజులు (39), సహాయకుడిగా ట్యాంకర్‌ డ్రైవర్‌ కొజెర్లపు ప్రభాకరరావు (37) ఎక్కారు. ట్యాంకర్‌ మూత భాగం వద్ద వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ట్యాంకర్‌ మూత తగిలి సోమయాజులు, ప్రభాకరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ట్యాంకర్‌ లోపల వాయు పీడనం అధికమై ఒక్కసారిగా పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️