ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ఇంటి ఎదుట పార్క్ చేసిన కారు డోర్లు ఓపెన్ చేసి ఉండడంతో దానిలోకి ఎక్కి ఆడుకుంటుండగా.. డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో సోమవారం చోటుచేసుకుంది. చిన్నారుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… చేవెళ్ల మండలం పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్-జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ (5), షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్-ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) ఈ నెల 30న జరగనున్న తమ మామయ్య తెలుగు రాంబాబు పెళ్లి కోసం దామరిగిద్ద గ్రామానికి ముందుగానే వచ్చారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సోమవారం ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటుండగా కారు డోర్ల ఆటోమెటిక్‌గా లాక్ పడిపోయింది. వారు కారులో ఇరుక్కుపోయిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. చిన్నారులు కారులో నుంచి బయటకు వచ్చేందుకు చాలాసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకడంతో కారులో విగతజీవులుగా కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిర్జీవంగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
