బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి

Oct 30,2024 23:53 #2 death, #East Godavari, #fire acident
  • పిడుగు పడడంతో ఘోరం
  • ఇద్దరు మహిళల మృతి
  • ఐదుగురికి తీవ్రగాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం : సిఎం

ప్రజాశక్తి- ఉండ్రాజవరం(తూర్పు గోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తయారీ కేంద్రం చెంతనగల కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. సూరారావుపాలెం – కాల్దారి రహదారిలో సాయి ఫైర్‌ వర్క్‌ పేరుతో వేగరోతు రామశివాజీ బాణసంచా తయారీ కేంద్రాన్ని రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో బుధవారం శివాజీ, ఆయన భార్య శ్రీవల్లి, మరో 13 మంది కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా భారీవర్షం పడింది. సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో, బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శివాజీ భార్య శ్రీవల్లి (35), పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన గుమ్మాడి సునీత (38) సజీవ దహనమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన కమిడి కుమారి, చుక్కా పెద్దింట్లు, పెంటపాడు మండలం రావుపాడుకు చెందిన మందలంక కమలరత్నం, శీలం లక్ష్మి, జంగారెడ్డి గూడేనికి చెందిన విప్పర్తి వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కారణంగా అంబులెన్స్‌ రావడానికి ఆలస్యం కావడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఉండ్రాజవరం ఎస్‌ఐ జి.శ్రీనివాస్‌ తన వాహనంలో ఐదుగురు క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి ఏలూరులోని ఆశ్రం ఆస్పతికి తరలించారు. ఘటనా ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చిన్నరాముడు, కొవ్వూరు ఆర్‌డిఒ రాణిసుస్మిత పరిశీలించారు. తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయని, బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని జెసి తెలిపారు.

మహిళల మృతి పట్ల సిఎం విచారం
ఇద్దరు మహిళలు మరణించడం పట్ల సిఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను సిఎం పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

➡️