- రూ.40 లక్షల విలువైన 32 దుంగలు స్వాధీనం
ప్రజాశక్తి- తిరుపతి (మంగళం) : తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలో దేవరకొండ ప్రధాన మార్గంలో రూ.40 లక్షల విలువైన 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు… టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఐ సాయిగిరిధర్‌కు చెందిన అటవీశాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేష్ కుమార్‌తో కలిసి టాస్క్‌ఫోర్స్ అధికారులు దేవరకొండ అటవీ ప్రాంతంవైపు కూంబింగ్ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు తుమ్మ చేనుపల్లి మట్టి రోడ్డు వద్ద చేరుకొగా అక్కడ మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని అనుసరించిన పోలీసులకు ఒక లగేజ్ వాహనం కనిపించింది. ఆ వాహనాన్ని చుట్టుముట్టడంతో అందులోని స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన పోలీసులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. లగేజ్ వాహనాన్ని తనిఖీ చేయగా 32 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఎర్రచందనం దుంగలతోపాటు స్మగ్లర్లు వినియోగించిన మోటార్ సైకిల్‌ను, లగేజ్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లో సిఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.