నీటి తొట్టిలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

Mar 31,2024 23:13 #Two students died, #water tank

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) :భారీ నీటి తొట్టిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులవరం తండాకు చెందిన తరుణ్‌ నాయక్‌ (14), వాంకడావత్‌ అరుణ్‌ నాయక్‌ (15) మాచర్లలోని గౌతమ్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూల్‌ హాస్టల్లోనే ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పాఠశాలకు సమీపంలోని రాయవరం జంక్షన్‌ వద్దకు వచ్చారు. అక్కడ జాతీయ రహదారి పనుల నిమిత్తం నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పది అడుగుల లోతుండే నీటి తొట్టిలో ఈతకు దిగారు. ఎంత సేపటికీ పైకి రాకపోవడంతో అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు ట్యాంకర్‌ డ్రైవర్‌కు విషయం చెప్పారు. దీంతో ఆయన నీటి తొట్టిలో దిగి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడి నుంచి తప్పుకుంది. మృతుల తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు భారీగా చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డలు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలలోని సామగ్రిని ధ్వంసం చేశారు. మృతదేహాలను పాఠశాల ఆవరణలో ఉంచి అందోళన చేపట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

➡️