ఇద్దరు వైసిపి రాజ్యసభ సభ్యులు రాజీనామా

  • 11 నుండి 9కి తగ్గిన బలం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ వెంటనే ఆమోదించారు. వెంకటరమణ పదవీకాలం 2026 వరకు ఉండగా, మస్తాన్‌రావు పదవీకాలం 2028 వరకు ఉంది. వీరిద్దరూ టిడిపిలో చేరనున్నారు. కనీసం ఆరుగురు వైసిపి రాజ్యసభ సభ్యులు పార్టీని వీడనున్నారని ఒక టిడిపి నేత తెలిపారు. వారిలో కొందరు టిడిపిలోనూ, మరికొందరు బిజెపిలోనూ చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇద్దరి రాజీనామాతో రాజ్యసభలో వైసిపి ఎంపిల సంఖ్య 11 నుండి తొమ్మిదికి పడిపోయింది.రాజ్యసభలో ప్రస్తుతం టిడిపికి ఒక్క స్థానం కూడా లేదు. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తే, అవి టిడిపి ఖాతాలో జమవుతాయి. ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో పలుమార్లు మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకట రమణ, జగన్‌మోహరెడ్డికి విధేయుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ నిరాకరించడంతో వైసిపితో విభేదించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఉండగా, వాడరేవు, నిజాంపట్నం ఇండిస్టియల్‌ కారిడార్‌ (వాన్‌పిక్‌) కుంభకోణంలో వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది.

టిడిపిలో చేరతా : వెంకటరమణ
టిడిపిలో చేరుతున్నానని, అందులో దాపరికం లేదని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమని, జగన్మోహన్‌రెడ్డి 100 శాతం తనకు సహకరించారన్నారు. కొన్ని సందర్భాలు, అంశాల్లో విభేదాలు వచ్చాయని, అందుకే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చానని అన్నారు.

వ్యక్తిగత కారణాలతో రాజీనామా : బీద మస్తాన్‌రావు
తన వెనుక ఎటువంటి ప్రలోభాలు లేవని బీద మస్తాన్‌రావు అన్నారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని, ఇంతకాలం పార్టీలో గౌరవం, అవకాశం ఇచ్చిన వైసిపి అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలని అన్నారు.

➡️