- తిరుపతిలో కుండపోత శ్రీ భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదల హెచ్చరిక
- అప్రమత్తంగా ఉండండి : సిఎం ఆదేశం శ్రీ ‘సోమశిల’ ఇన్‌ఫ్లోపై నిరంతరం నిఘా
- శ్రీలంకలో 25 మంది మృతి శ్రీ తమిళనాడులో భారీ వర్షాలు
ప్రజాశక్తి – యంత్రాంగం : తమిళనాడుతో పాటు దక్షిణకోస్తాను వణికించిన ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పుదుచ్చేరి సమీపంలో తుపాన్ తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురం-కరైకల్ మధ్య తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని, అర్ధరాత్రి దాటిన తరువాత పూర్తిస్థాయిలో దాటే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలోనూ ఆ తరువాత 24 గంటల పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమలోని ఒకటి, రెండు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పెన్నా పరివాహక ప్రాంతంలో అకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్) ప్రమాదం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలపగా శనివారం సాయంత్రం నుండే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ ఈదురుగాలులు వీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక వరదల హెచ్చరిక నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీమ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సిఎం పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీలంకలో బీభత్సం… తమిళనాడులో తీవ్రం
తుపాను ప్రభావం తమిళనాడుతోపాటు, శ్రీలంకపైన తీవ్రంగా పడింది. శ్రీలంకలోని ఈస్టరన్ ప్రావిన్స్‌లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలతోపాటు, ఈదురు గాలుల తీవ్రత ప్రజలను అతకలాకుతలం చేసింది. వర్షాలు, వరదల బారిన పడి 15 మంది మరణించారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. 4.50 లక్షల మంది నిరాశ్రయులైనట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. రంగంలోకి దిగిన ఆర్మీ సహాయక చర్యలను చేపట్టింది. మనదేశంలోని తమిళనాడులోని తుపాన్ ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలోని పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. తమిళనాడులోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
తిరుపతిలో కుండపోత
తుపాన్ కారణంగా రాష్ట్రంలోని తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకూ గాలివాన బీభత్సం సృష్టించింది. తిరుమలలో పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. తడ మండలంలో అత్యధికంగా 120.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సత్యవేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో స్వర్ణముఖి నది నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ఎన్‌టిఆర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో, నీవా నది పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోడూరు, తుమ్మలపెంట తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమశిల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సమానంగానే ఉన్నాయని, ప్రవాహం పెరిగితే నీటి విడుదలకు నిర్ణయం తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక జారీ అయిన పెన్నా పరివాహక ప్రాంతంలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. సోమశిల ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో ఆత్మకూరు, కావలి, నెల్లూరు ఆర్‌డిఒలు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్షం కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న పంట నేలకొరిగిపోగా, వర్షపు నీరు చేరి తడిసిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర గ్రామాలైన ఎస్.యానాం, వాసాలతిప్ప, ఎన్.కొత్తపల్లి, రాఘవులపేటలో మత్స్యకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.