- స్కీమ్‌వర్కర్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ
- రెండో రోజూ కొనసాగిన జిల్లా మహాసభ
ప్రజాశక్తి- చీమకుర్తి, ఒంగోలు బ్యూరో : ట్రూ అప్ ఛార్జీల పేర విద్యుత్ ఛార్జీలను పెంచారని, ప్రజలపై కోట్లాది రూపాయల భారాలను మోపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. సుబ్బరావమ్మ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగులగొట్టాలని చెప్పిన లోకేష్… అధికారంలో వచ్చాక, షాపులకు కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. త్వరలో ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధం అవుతున్నారని వివరించారు. చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో (కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్)లో రెండోరోజైన శనివారం సిపిఎం జిల్లా మహాసభ సందర్భంగా ప్రతినిధుల సభ జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే స్కీమ్ వర్కర్లను తొలగించేందుకు సిద్ధమైందని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తున్నారని తెలిపారు. ఇసుక సమస్య నేటికీ పరిష్కారం కాలేదని, మహిళలు వద్దన్నా మద్యాన్ని ఊరూవాడా విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా విక్రయిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై వచ్చిన వ్యతిరేకతను దారి మళ్లించడానికి, అణచివేయడానికి మతోన్మాద అజెండాతో పాటు క్రిమినల్ చట్టాలలో మార్పులు తీసుకొచ్చారని విమర్శించారు. ఉద్యమాలను, హక్కులను కాలరాసేందుకే క్రిమినల్ చట్టాలలో మార్పులు చేశారని పేర్కొన్నారు. చేతులకు బేడీలు వేసే పద్ధతిని పునరుద్ధరించారని తెలిపారు. జమిలి ఎన్నికలను కేంద్రం ముందుకుతెచ్చిందని, ప్రతిపక్షాలు, ప్రజలు వ్యతిరేకిస్తున్న కేబినెట్ ఆమోదించిందన్నారు. కీలక రంగాలన్నింటినీ అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం గిరిజనులకు అందడం లేదని పేర్కొన్నారు. అదానీ విద్యుత్ కుంభకోణంపై చంద్రబాబు, జగన్ మౌనం దాల్చారన్నారు. ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటాలతో, ఉద్యమాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభకు అధ్యక్షవర్గంగా పూనాటి ఆంజనేయులు, సోమయ్య, కె.రమాదేవి వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ రాజకీయ నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హాజరై మహాసభను పర్యవేక్షించారు. మహాసభ ప్రారంభ సూచికగా ఎర్ర జెండాను సీనియర్ నాయకులు జాలా అంజయ్య ఆవిష్కరించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి సీనియర్ నాయకులు వై.సిద్దయ్య పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పమిడి కోటయ్య చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, తవనం చెంచయ్య చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, అండ్రా మాల్యాద్రి పాల్గొన్నారు.