వసంత రాకను వ్యతిరేకిస్తూ ఉమా బల ప్రదర్శన

ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు టిడిపిలో చేరకముందే ఆ క్యాడర్‌ నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిడిపి కార్యకర్త చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం మైలవరం ప్రభుత్వాస్పత్రికి మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలకు చెందిన వంద మందికి పైగా నాయకులతో ఆస్పత్రి నుండి మైలవరం పొందుగల రోడ్డులోని మృతుని ఇంటికి వెళ్లారు. అనంతరం పంచాయతీ సెంటర్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో దేవినేని ఉమా నాయకత్వం వర్ధిల్లాలి, వసంత డౌన్‌ డౌన్‌ అంటూ టిడిపి శ్రేణులు గట్టిగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వసంత తమపై తప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడొచ్చి తమ నెత్తి మీద కూర్చుంటానంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి అభ్యర్థుల మొదటి విడత జాబితాలో దేవినేని ఉమా పేరు లేదు. అసంతృప్తులను చంద్రబాబు ఈ నెల 25న తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడిన నేపథ్యంలో దేవినేని ఉమాను బుజ్జగించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఉమాను పక్కనపెట్టి మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కష్ణ ప్రసాద్‌కు మైలవరం టికెట్‌ కేటాయిస్తున్నట్లు టిడిపి అధిష్టానం హామీ ఇచ్చిందని వసంత వర్గీయులు చెబుతున్నారు.

➡️