అనుకున్న మేర చేయలేకపోయాం : ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్‌

May 1,2025 19:00 #ys jagan, #ysrcp

2.0లో అందరికీ అన్నీ చేస్తాం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వ హయాంలో కార్యకర్తలకు అనుకున్న మేర చేయలేకపోయామని, జగన్‌ 2.0లో అందరికీ పెద్దపీట వేస్తామని మాజీ సిఎం, వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో గురువారం తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కాములు జరుగుతున్నాయని తెలిపారు. ఇసుక, మట్టి, మద్యం ప్రతిదీ మాఫియా నడుస్తోందని విమర్శించారు. ఊరిలో ఎక్కడ చూసినా బెల్టు షాపులే దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తున్నారని వివరించారు. రాష్ట్రమంతా దోచుకో, పంచుకో తినుకో అనే పద్దతి నడుస్తోందని, అడ్డగోలుగా భూ దోపిడీ సాగుతోందని పేర్కొన్నారు. రూపాయికి ఇడ్డీ రాకపోయినా ఎకరం భూమి మాత్రం ఇస్తున్నారని విమర్శించారు. ఊరుపేరులేని కంపెనీలకు భూములు దారధత్తం చేస్తున్నారని, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు పేరిట దోచుకుంటున్నారని వివరించారు. చంద్రబాబుకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని విమర్శించారు. ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు చూపించిన తెగువ అమోఘమని, నిబద్ధతతో నిలబడ్డారని పేర్కొన్నారు. విశ్వసనీయ రాజకీయాలు అంటే వైసిపి ప్రజాప్రతినిధులను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. రాష్ట్రం రాక్షస పాలనలో ఉందని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడినా ప్రజల గుండెల్లో ఉన్నామని తెలిపారు. వైసిసి కార్యకర్తలు ప్రజల వద్దకు కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలరని, టిడిపి శ్రేణులు వెళ్లే పరిస్థితి లేదని పేర్కొన్నారు. జగన్‌ హయాంలో ప్రతి ఇంట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేవని, చంద్రబాబు వారి కంచాన్ని లాగేసుకున్నారని వివరించారు. కార్యకర్తలు పడుతున్న కష్టాలను చూశానని, వారివద్దకే జగన్‌ పాలన ఉంటుందని పేర్కొన్నారు.

➡️