- ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రప్రభుత్వం వక్ఫ్ చట్టానికి ప్రతిపాదించిన రాజ్యాంగ వ్యతిరేక సవరణలను తిరస్కరించి వాటి ఆస్తులను రక్షించాలని సిపిఎం రాష్ట్రకమిటీ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం నాడు లేఖ రాశారు. దేశంలో మైనార్టీ తరగతుల ప్రజలు తమ విశ్వాసాలను, భాషా, లిపి, సంస్కృతిని కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం ప్రత్యేకంగా రాయితీలను కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ముస్లిం ప్రజల్లో సంపన్నులు తమ సంపదలో కొంత భాగాన్ని వక్ఫ్ పేరిట అంకితం చేస్తారని తెలిపారు. ముస్లింలకు ధార్మిక, విద్యాభివృద్ధి తదితర ప్రయోజనాలను అందించడానికి స్వాతంత్య్రం కంటే పూర్వం నుంచి ఈ ఆస్తులను వక్ఫ్ చేయడం జరుగుతోందని తెలిపారు. వక్ఫ్‌గా నమోదు కాబడిన ఆస్తుల అభివృద్ధి నిర్వహణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజల భాగస్వామ్యంతో బోర్డును ఏర్పాటు చేసి నిర్వహించడమనేది చట్టపరంగా ఇంత వరకు జరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. ‘బ్రిటీష్ హయాంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ముస్లిం పెద్దలు ప్రత్యేకంగాచూశారు. స్వాతంత్య్రానంతరం 1954లో ఒక సమగ్రమైన చట్టాన్ని(వక్ఫ్ చట్టం)రూపొందించారు. దాని స్థానంలో 1995లో వక్ఫ్ ఆస్తులకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంగా మరో చట్టం చేశారు.’ అని లేఖలో శ్రీనివాసరావు వివరించారు.
భక్షణ కోసమే సవరణలు…
ఈ చట్టానికి 119 సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిందని శ్రీనివాసరావు తెలిపారు. ‘ఈ సవరణల్లో అత్యధికం వక్ఫ్ ఆస్తుల రక్షణకు కాకుండా వాటి భక్షణకు ఉపయోగపడేలా ఉన్నాయి. ఆస్తుల స్వభావాన్ని పూర్తిగా మార్చివేయడంతో పాటు బోర్డు నిర్వహణను ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకోవడానికే ఈ సవరణలు చేసిందనే ఆందోళన ముస్లిం మైనార్టీలలో ఏర్పడింది.’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఒత్తిడి ఫలితంగా ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జెపిసి)కి రెఫర్ చేశారని వివరించారు. వివిధ తరగతుల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని జెపిసి తరపున ప్రకటన వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీన హైదరాబాద్‌లో జెపిసి చేసిన ప్రజాభిప్రాయ సేకరణను గమనిస్తే తూతూ మంత్రంగా అభ్యంతరాలను స్వీకరించినట్లు అర్ధమవుతుందని తెలిపారు. జెపిసిలో అధ్యక్షులు, సభ్యులు సవరణలన్నింటినీ బలపర్చేలా తీర్మానిం చాలని ఉన్నట్లుగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశంలో ఈ బిల్లు ఆమోదించాలని భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయని తెలిపారు.
హిందూత్వ మతోన్మాదులకే ఉపయోగం…
ఈ సవరణల ద్వారా వక్ఫ్ బై యూజర్ అన్న భావనను తొలగిస్తూ రిజిష్టర్ కాబడిన ఆస్తులను మాత్రమే వక్ఫ్ ఆస్తులుగా పరిగణిస్తామని ప్రతిపాదిస్తున్నారని, దీనివల్ల అనుభవం ద్వారా అనేక తరాలుగా ముస్లింలవిగా పరిగణింపబడుతున్న ఖబరస్తాన్‌లు, మసీదులు, దర్గాలన్నీ వివాదంలోకి వస్తాయన్న ఆందోళనను శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. అనేక తరాల ఈ ఆస్తులకు డాక్యుమెంట్లు ఎవరి వద్ద ఉండవన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని ఉపయోగించుకుని హిందూత్వ మతోన్మాద శక్తులు వివాదాలు సృష్టించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఒక్క బాబ్రీ మసీదు వివాదంతోనే దేశం తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వందల బాబ్రీ మసీదు వంటి వివాదాలు సృష్టించడానికి ఈ సవరణలు ఉపయోగపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేశాలు పెంచడం, ప్రజల్ని విభజించడం లక్ష్యంగా ఈ సవరణలున్నాయని తాము భావిస్తున్నామని తెలిపారు.
కలెక్టర్లకు అధికారాలు
ప్రస్తుత ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ సంస్థలు చేస్తున్న సామాజిక కార్యక్రమాలన్నింటిపై ఆంక్షలు విధిస్తాయని లేఖలో పేర్కొన్నారు. ఈ సవరణలు అమల్లోకి వస్తే అనేక వందల ఏళ్లుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు కూడా మరలా ప్రభుత్వం పరిశీలనకు వస్తాయని తెలిపారు. ఈ ఆస్తులకు సంబంధించిన ఏ వివాదమైనా కలెక్టర్ నిర్ణయమే తుది నిర్ణయంగా ప్రతిపాదిత సవరణలు చెబుతున్నాయని పేర్కొన్నారు. వక్ఫ్ సర్వే కమిషనర్ వ్యవస్థను, వక్ఫ్ ట్రిబ్యునల్స్‌ను అధిగమించే అధికారం కలెక్టర్లకు ఇవ్వబడుతుందని తెలిపారు. న్యాయస్థానం ద్వారానే వివాదాలు పరిష్కారం కావాలని, అయితే ప్రస్తుత సవరణలు ఆస్తులను కొల్లగొట్టడానికే తోడ్పడతాయని వివరించారు.వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో, నిర్వహణలో కూడా రాజకీయ జోక్యానికి పూర్తిగా అవకాశం కల్పించి బోర్డులలో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలని, అధికారులను కూడా ముస్లిమేతరులను నియమించేలా సవరణ చేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ఆటంకం కల్గించే పద్ధతిలో ఉన్నాయని తెలిపారు.
నిరాకరించి…కేంద్రంపై ఒత్తిడి తెండి
దేశవ్యాపితంగా ముస్లిం ప్రజానీకం, సంస్థలు, లౌకికవాదులు, ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నారని శ్రీనివాసరావు వివరించారు. ఒక సెక్యులర్ పార్టీ నాయకుడిగా ఒక మతానికి చెందిన ప్రజలకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా తలపెట్టిన ఈ సవరణలను నిరాకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. ఆందోళనతో ఉన్న ముస్లిం ప్రజానీకానికి ఈ దిశలో చంద్రబాబు చర్య తీసుకుంటే ఎంతో ఉపశమనం కల్గిస్తుందని తెలిపారు. అందుకు పూనుకోవాలని బాబునుకోరారు.