ఉడకని కోడిగుడ్లు, నీళ్ల చారు

Aug 29,2024 23:34 #food pioson, #iiit student, #nuziveedu
  • కూర, భోజనంలో తెల్లని పురుగులు
  • మంత్రి ఆదేశించినా మారని తీరు
  • నూజివీడు ట్రిపుల్‌ఐటిలో మరో 114 మందికి అస్వస్థత

ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌ : నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో జ్వరాలు, ఇతర రోగాల తీవ్రత కొనసాగుతోంది. గురువారం మరో 114 మంది అస్వస్థతకు గురై కళాశాలలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. మంత్రి, ఉన్నతాధికారులు స్వయంగా కళాశాలను సందర్శించి పరిశుభ్రతతోపాటు ఆహార పదార్థాల నాణ్యత మెరుగుపర్చాలని ఆదేశించినా సంబంధిత అధికారులు, మెస్‌ కాంట్రాక్టర్‌ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు పెట్టిన బెండకాయ కూరలో తెల్లని పురుగులు రావడం కలకలం రేపింది. మెస్‌ కిచెన్‌లో అపరిశుభ్రత వాతావరణం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
బుధవారం 800 మంది అస్వస్థతకు గురికాగ గురువారం మరో 114 మంది అస్వస్థతకు గురై అవుట్‌ పేషెంట్లుగా చికిత్స పొందారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కళాశాలలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో గతవారం రోజుల్లో నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 900 దాటింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, నరాల పోటు, కీళ్లనొప్పులు, డయేరియా, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో విద్యార్థులు బాధపడుతున్నారు.

మంత్రి ఆదేశించినా నాణ్యమైన భోజనం నిల్‌
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి బుధవారం అర్ధరాత్రి వరకూ సమీక్షించారు. మెస్‌లో ఆహార నాణ్యతను పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలని ఆదేశించారు. అయితే మంత్రి వెళ్లిన తెల్లారే గురువారం ఉదయమే ఉడకని కోడిగుడ్లు, ఉప్మా అల్పాహారంగా విద్యార్థులకు పెట్టడం గమనార్హం. విద్యార్థులు వాటిని తినలేక చెత్త కుండీల్లో పారేశారు. కనీసం మధ్యాహ్నం భోజనమైనా పరిశుభ్రంగా ఉంటుందని ఆకలితో వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురయ్యింది. నీళ్ల చారు, నీళ్లను తలపించే మజ్జిగ, బెండకాయ కూర, అన్నంలో పురుగులు రావడంతో తినలేక మళ్లీ చెత్త కుండీల్లో పడేశారు.

అపరిశ్రుభతే కారణం : మల్లీశ్వరి
మంత్రి ఆదేశాలను సైతం అమలు చేయకపోవడం, ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చకపోవడం దారుణమని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌.మల్లీశ్వరి అన్నారు. ట్రిపుల్‌ ఐటిని ఆమె నేతృత్వంలో అధికారుల బృందం గురువారం సందర్శించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పరిశీలించి, అనంతరం వంట చేసే ప్రాంతాలన్నింటినీ పరిశీలించింది. ఈ బృందం పరిశీలన కొనసాగిస్తున్న సమయంలోనే భోజనంలో తెల్లని పురుగులు రావడం గమనించారు. అపరిశుభ్రంగా ఉన్న వంటశాలలు గుర్తించారు. ప్రతి విద్యార్థి నుండి అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. మెడికల్‌, కళాశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆహార పదార్థాల నాణ్యతతోపాటు పరిశుభ్రతలేమి కారణమే సమస్యకు మూలమని తెలిపారు.

➡️