ప్రజాశక్తి-అమరావతి : రేషన్ షాపుల డీలర్‌షిప్‌లను ఏకపక్షంగా రద్దు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డీలర్‌షిప్‌ల రద్దు వల్ల డీలర్లు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారని హెచ్చరించింది. ఆరోపణలు వస్తే తగిన విచారణ చేశాకే రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగిపై ఆరోపణలు వస్తే ఏ విధమైన విచారణ చేస్తారో, డీలర్‌షిప్‌లపై ఆరోపణల విషయంలో కూడా విచారణ జరగాలంది. డీలర్ల వాదనలు వినాలని, డీలర్‌తో పాటు ఒకవేళ సాక్షులు ఉంటే వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని చెప్పింది. కార్డుదారులు లేదా ఇతరులు ఫిర్యాదు చేస్తే డీలర్ సమక్షంలో విచారణ చేయాలంది. ఆ వ్యక్తులకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా ఇవ్వాలంది. చర్యలు తీసుకునేముందు కారణాలు పేర్కొనాలంది. విచారణ జరపకుండా తహశీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీలర్షిప్ రద్దు చేస్తూ ఆర్‌డిఒ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆక్షేపించింది. తహశీల్దార్ తయారు చేసిన నివేదికను డీలరుకు అందజేయలేదని తప్పుపట్టింది. ఆర్‌డిఒ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పేర్కొంటూ వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. చిత్తూరు జిల్లా, మదనపల్లిలో ఎం అరుణకు చెందిన చౌక ధర దుకాణం డీలర్షిష్‌ను మదనపల్లి ఆర్‌డిఒ 2009 ఫిబ్రవరి 18న రద్దు చేశారు. దీనిని జాయింట్ కలెక్టర్ 2009 ఫిబ్రవరి 20న, జిల్లా కలెక్టర్ 2013 ఫిబ్రవరి 10న సమర్ధిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే ఏడాది అరుణ వాటిని హైకోర్టులో సవాల్ చేస్తే సింగిల్ జడ్జి డిస్మిస్ చేస్తూ.. 2024 జులై 16న తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను అనుమనితిస్తూ ద్విసభ్య ధర్మాసనం పైవిధంగా తీర్పు వెలువరించింది.
