కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రజాశక్తి – యలమంచిలి : వైసిపి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోకపోతే మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడకుండా కాళ్లు చేతులు నరికేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో రూ.1.78 కోట్ల నిధులతో చేపట్టనున్న లింక్‌ రోడ్లు, జలజీవన్‌ మిషన్‌ మంచినీటి పథకం పనులకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు అనంతరం యలమంచిలి గ్రామంలో ‘మన రైతు – మన పాలకొల్లు’ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో పాల్గొని మాట్లాడారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, సర్పంచ్‌ స్థాయి నుండి మంత్రుల వరకు అందినకాడికి దోచుకు తిన్నారని, అభివృద్ధి పనులు చేయాలని కోరితే వారిపై కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు వైసిపి నేతలకు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదని, గతంలో రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల ‘తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, వచ్చిన తరువాత కూటమి నాయకులను ఇళ్లల్లోంచి లాక్కొచ్చి నరికేస్తామని అహంకారంతో మాట్లాడటం దేనికి నిదర్శనమని అన్నారు. కారుమూరి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాట్లాడకుండా నాలుక కోస్తామని, నడవడానికి అవకాశం లేకుండా కాళ్లు చేతులు నరికేస్తామని వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని సభకు వచ్చిన పలువురు చర్చించుకోవడం కన్పించింది.

➡️