– అధిక ధరకు ప్రైవేట్ నుంచి కొనుగోలు
– భవిష్యత్తులో ట్రూఅప్ భారాలే?
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 245 మిలియన్ యూనిట్లు (ఎంయు) దాటింది. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాయి. సరాసరి యూనిట్ ధర రూ.7.45లతో స్వల్పకాలిక ఒప్పందం పేరుతో రోజుకు సుమారు రూ.23 కోట్లు కొనుగోలుకు వెచ్చిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) అనుమతినిచ్చిన దానికంటే రూ.3 ఇది అదనం. ప్రస్తుతానికి అవసరమైన డిమాండ్ తీరుస్తున్నా.. తరువాత సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో పంపిణీ సంస్థలు భారాలు మోపడం ఖాయం. మేలో ఎండల తీవ్రత మరింత పెరిగి రాష్ట్ర డిమాండ్ 250 ఎంయులు దాటే అవకాశం ఉండటంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్‌కు తగ్గట్టుగా పంపిణీ సంస్థలు తగిన కార్యాచరణను రూపొందించలేదు. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బగ్గు కొరతను అధిగమించడంలో విద్యుత్ సంస్థలు విఫలమవుతున్నాయి. ఉన్న అరకొర బగ్గుతోనే నెట్టుకొస్తున్న థర్మల్ ప్లాంట్లు అనుకున్నంత విద్యుత్ ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. ప్లాంట్ లోడ్ ఫాక్టర్ 85 శాతం ఉండాల్సింది, రాష్ట్రంలో మూడు జెన్‌కో ప్లాంట్లు కలిపి 68 శాతం మాత్రమే నమోదవుతుంది. అనుకున్న మేర ఉత్పత్తి రాకపోవడంతో మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. రోజుకు సరాసరి 40 ఎంయులకు పైగా రూ.23 కోట్లతో పంపిణీ సంస్థలు కొంటున్నాయి. రాష్ట్ర జెన్‌కో ఉత్పత్తి సంస్థల నుంచి 99 ఎంయులు, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి 35 ఎంయులు, పవన విద్యుత్ 15 ఎంయులు, సోలార్ నుంచి 22 ఎంయులు, ఒప్పంద సంస్థల నుంచి 33 ఎంయు, స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 42 ఎంయుల చొప్పున విద్యుత్ అందుతోంది. మంగళవారం నాడు యూనిట్ రూ.7.430 చొప్పున 43.694 ఎంయులను రూ.28.897 కోట్లు పెట్టి పంపిణీ సంస్థలు కొనుగోలు చేశాయి.
థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బగ్గు కొరత వేధిస్తూనే ఉంది. ప్లాంట్లకు ఒక్కరోజు బగ్గు ఆగినా అందులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. కనీసం 15 రోజులకు 10,73,835 మెట్రిక్ టన్ను(ఎం.టి)ల బగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా దానిలో కేవలం 7 శాతం బగ్గు మాత్రమే మంగళవారం నాటికి ఉంది. దేశంలోనే అత్యంత తక్కువ బొగ్గు కలిగిన ప్లాంట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థగా ఎపి జెన్‌కో నిలిచింది. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో మూడు థర్మల్ ప్లాంట్లకు రోజుకు 71,100 ఎం.టిల బగ్గు అవసరం. ప్రస్తుతం మూడు ప్లాంట్లలో విజయవాడ ప్లాంట్‌కు 2.5 రోజులకు, రాయలసీమ ప్లాంట్‌కు 3.6 రోజులు, కృష్ణపట్నం ప్లాంట్‌కు 4.7 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.
