ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్ డి ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1321వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎస్‌ఎంఎస్ – 2 తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ రానున్న రెండు నెలలూ ఉద్యమాలను ఉధృతం చేయనున్నామన్నారు. ఉక్కు కర్మాగార సంక్షోభానికి కేంద్ర బిజెపి విధానాలే కారణమని తెలిపారు. ప్లాంట్‌కు నిధులు కేటాయించి సంక్షోభం నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. కర్మాగారం వల్ల లక్షలాది మంది బతుకుతున్నారని, ప్రయివేటీకరణ చేయడం దారుణమని అన్నారు. దీక్షల్లో నాయకులు కడిమి రాజబాబు, జె నరేష్ కుమార్, చీకటి శ్రీనివాస్, జగదీష్, కరణం పైడిరాజు, వరప్రసాద్, సతీష్, ఇందల శివ కుమార్, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు