ఆగని హింస

  • వైసిపి దాడిలో టిడిపి అభ్యర్థికి అస్వస్థత
  • ఆత్మరక్షణ కోసం గాలిలోకి గన్‌మేన్‌ కాల్పులు 
  • తాడిపత్రిలో భాష్పవాయువు ప్రయోగం
  • పల్నాడులో ఎస్‌సి, బిసిల ఇళ్లపై దాడులు

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసినా ఘర్షణలు ఆగలేదు. అనంతపురం, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మంగళవారం కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టిడిపి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నానిపై వైసిపి వారు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం ఎమ్మెల్యే గన్‌మేన్‌ గాలిలోకి కాల్పులు జరిపారు. పల్నాడులో ఘర్షణలను అదుపు చేయడానికి వెళ్లిన సిఐకి గాయాలయ్యాయి. ఘర్షణలను అదుపు చేయడానికి తాడిపత్రిలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌ రూములను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారును కొందరు దుండగులు అడ్డగించి సమ్మెట, రాడ్లు, బీరు బాటిళ్లు, క్రికెట్‌ స్టిక్స్‌, రాళ్లతో దాడి చేశారు. రాళ్లు ఛాతీకి తగలడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాని గన్‌మేన్‌ ధరణిపైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో, ఆత్మరక్షణ కోసం గన్‌మేన్‌ ఒక రౌండ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన తెలిసి టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. వైసిపి కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరుగ్రూపులనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నానిని, ఆయన గన్‌మేన్‌ ధరణిని స్విమ్స్‌కు తరలించారు. తమకు అందిన వీడియోల ఆధారంగా ఈ ఘటనకు పాల్పడింది రామచంద్రాపురం మండలం వైసిపి జెడ్‌పిటిసి సభ్యుడు భానుప్రకాష్‌ (భాను), ఆయన అనుచరులని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు తీవ్రంగా ఖండించారు.

పల్నాడులో సిఐకి గాయాలు
పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నగండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కొందరు వైసిపి నాయకుల ఇళ్లపై టిడిపి వారు దాడులు చేయడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆ గ్రామానికి మంగళవారం వచ్చారు. ఈ సమయంలో పిన్నెల్లి సోదరులపై టిడిపి వారు రాళ్లు విసరడంతో వైసిపి వారు కర్రలు, రాడ్లతో ఎదుర్కొన్నారు. టిడిపి ఆఫీసుపై దాడి చేసి, టిడిపికి చెందిన జానీ బాషా కారును తగులబెట్టారు. అదుపు చేసేందుకు వెళ్లిన సిఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారు. టిడిపి సానుభూతిపరుల ఇళ్లపైనా, దుకాణాలపైనా వైసిపి వారు దాడులకు పాల్పడ్డారు. గ్రామంలో మళ్లీ ఘర్షణలు తలెత్తడంతో పోలీసులు కేంద్ర బలగాలను రప్పించి దుకాణాలను పూర్తిగా మూయించారు. 144 సెక్షన్‌ ప్రకటించారు. మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామంలోని వైసిపికి చెందిన బిసిలు, ఎస్‌టిలపైనా, వారి ఇళ్ల ఇళ్లపైనా టిడిపి వారు మూక్ముడి దాడులకు పాల్పడ్డారు. దీంతో, ఆ ఇళ్లలోని పురుషులు ప్రాణభయంతో మహిళలు, చిన్నారులను వృద్ధులను తీసుకొని పొలాల దారిలో పారిపోయారు. కొందరు గ్రామ శివారులోని గంగమ్మ దేవాలయంలో రాత్రంతా తలదాచుకున్నారు. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు దాడులు కొనసాగాయని, ఇళ్లను, వాటిలోని బీరువాలను, టివిలను, ఫ్రిజ్‌లను, బయట ఉన్న ద్విచక్ర వాహనాలను, జీవనోపాధిగా ఉన్న ఆటోలను ధ్వంసం చేశారని, దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం విడిచి వెళ్ల్లిపోవాలని, లేదంటే చంపేస్తామని హెచ్చరించారని వారు వాపోయారు.

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టిడిపి, వైసిపి నేతల మధ్య దాడులు, ప్రతిదాడులు మంగళవారం కూడా కొనసాగాయి. టిడిపి నాయకులు సూర్యముని ఇంట్లోని ఫర్నీచర్‌ను కొందరు ధ్వంసం చేశారు. వైసిపి వారే ఈ ఘటనకు పాల్పడ్డారని టిడిపి వారు ఆరోపించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టిడిపి నాయకులు ప్రతి దాడిగా రాళ్లురువ్వారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఇరుగ్రూపులనూ పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో తాడిపత్రి పట్టణ సిఐ మురళీకృష్ణ తలకు రాయి తగిలి గాయమైంది. సూర్యమునిపై దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టిడిపి మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకోవడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అయినా, టిడిపి మద్దతుదారులు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి వైపు వెళ్లారు. వందలాదిమంది వైసిపి కార్యకర్తలు ఎదురుగా వచ్చారు. గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీ క్రీడా మైదానంలో ఇరుగ్రూపుల వారు ఒకరిపై ఒకరు దాదాపు మూడు గంటలపాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఒక వైసిపి కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రకాశం జిల్లాలో రాళ్లతో పరస్పరం దాడులు
వాదంపల్లిలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామానికి వైసిపి నాయకులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గత వారం రోజుల వరకు అందరూ ఈ నీళ్లు పట్టుకునేవారు. ఇటీవల ఆ గ్రామానికి చెందిన ఎనిమిది ముదిరాజు కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. మంగళవారం గ్రామంలోకి వచ్చిన నీటి ట్యాంకర్‌ వద్దకు నీటి కోసం వెళ్లిన ఈ కుటుంబాలకు చెందిన మహిళలను వైసిపి వారు అడ్డుకున్నారు. ‘మా ట్యాంకర్ల నీళ్లు మీకెందుకు?’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నెలకొన్న వివాదం ఇరుగ్రూపులకు చెందిన పురుషుల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది. ఇరుగ్రూపులకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. అడిషనల్‌ ఎస్‌పి పోలీసు బలగాలతో గ్రామానికి వచ్చి ఘర్షణను అదుపులోకి తెచ్చి పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

➡️