అప్పటి వరకు పోలీస్‌ అధికారులపై చర్యలొద్దు..

  • జత్వానీ కేసులో హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : ముంబయి సినీనటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పోలీస్‌ అధికారులు వేసిన వ్యాజ్యంలో కౌంటర్‌ వేసేందుకు పోలీసులు గడువు కోరారు. పోలీసుల వినతి మేరకు విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తూ జస్టిస్‌ విఆర్‌కె కృపాసాగర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఐపిఎస్‌ అధికారులు క్రాంతిరాణా టాటా, విశాల్‌ గున్ని, విజయవాడ గత ఎసిపి హనుమంతురావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా వేసిన పిటిషన్లలో ప్రాసిక్యూషన్‌ కౌంటర్‌ వేసేందుకు సమయం మంజూరు చేశారు.

➡️