ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌కు గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. 3989 మంది అంగన్‌వాడీ సహాయకులను అదనంగా నియమించుకోవడానికి, 35,700 అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల నాలుగు రకాల బరువు, ఎత్తు కొలుచేందుకు పోషణ్ అభియాన్ 2.0 పథకం క్రింద 28.56 కోట్ల రూపాయల మంజూరుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క) బాధ్యతలు స్వీకరించారు. ఈ కేంద్రాల్లో అంగన్‌వాడీ సిబ్బందితో పాటు అదనంగా ఇద్దరు శిశు సంరక్షకులను నియామకం కోసం రూ.1,27,24,800 నిధులను కేటాయించారు. గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో 200 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
