కర్నూలులో యురేనియం తవ్వకాలకు అనుమతి లేదు

  • అనుమతి కోసం ఎఎండి వేచి చూస్తోంది
  • కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కర్నూలులో యురేనియం నిల్వలను కనిపెట్టేం దుకు అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ (ఎఎండి) ఎటు వంటి అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. యురేనియం నిల్వలను కనిపెట్టేందుకు కర్నూలు జిల్లాలోని 15 గ్రామాల్లో 68 బోర్లు తవ్వేందుకు అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ (ఎఎండి) అనుమతినిచ్చిన విషయం వాస్తవమేనా? అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. 2017-18లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (అటవీ శాఖ) అనుమతి పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎఎండి), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డిఎఙ) కర్నూల్‌ డివిజన్‌లోని ఆదోని రేంజ్‌లో కప్పట్రాళ్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 20 బోర్ల డ్రిల్లింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు. భూగర్భంలో తక్కువ గ్రేడ్‌ యురేనియం ఖనిజం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలను డ్రిల్లింగ్‌ సూచించిందని అన్నారు. యురేనియం ఖనిజం ఉండే అవకాశాన్ని తనిఖీ చేయడానికి డ్రిల్లింగ్‌ కోసం విజయవాడలో ఉన్న అటవీ, పర్యావరణ శాఖను అనుమతి కోసం ఎఎండి అభ్యర్థించిందని తెలిపారు.

➡️