- మానవ హక్కుల వేదిక డిమాండ్
ప్రజాశక్తి-దేవనకొండ (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో యురేనియం వెలికితీసే ప్రయత్నాలు చేపట్టబోమని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యుజి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి యుఎం దేవేంద్రబాబు, తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు విఎస్.కృష్ణ డిమాండ్ చేశారు. కప్పట్రాళ్ల, నెల్లబండ, పి.కోటకోండతోపాటు రిజర్వు ఫారెస్టులో వారు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల వల్ల ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దెబ్బతింటాయని, వారికి జీవనోపాధి లేకుండాపోతుందని తెలిపారు. 2017లోనే రహస్యంగా, ఎటువంటి పారదర్శకత లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా 20 బోర్లను వేశారని గుర్తు చేశారు. యురేనియం తవ్వకాలు మానవజాతికి, పర్యావరణానికి అత్యంత హానికరమని తెలిపారు. యురేనియం తవ్వకాల వల్ల భూమి విషపూరితమవుతుందని, భూగర్భజలాలు తగ్గిపోతాయని, కలుషితమవుతాయని తెలిపారు. కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్ నుంచి పారే వర్షపునీరు కోటకొండ చెరువు, నాగమ్మవంక మీదుగా మాచవరం చెరువులోకి ప్రవహిస్తాయని, ఈ చెరువులు యురేనియం మైనింగ్ వల్ల కలుషితమైతే 25 గ్రామాల ప్రజల జీవితాలు దెబ్బతింటాయని తెలిపారు. రిజర్వు ఫారెస్టులో ఉండే అటవీ జంతువుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. కప్పట్రాల ప్రాంతంలో యురేనియం నిల్వల అంచనా కోసం జరిగే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.