ఉపయుక్తంగా కౌలు రైతు సంఘం డైరీ

  • స్పెషల్‌ సిఎస్‌ బి రాజశేఖర్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కౌలు రైతులకు, రైతులకు ఉపయోగపడే ఎంతో సమాచారం ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రూపొందించిన డైరీలో ఉందని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సిఎస్‌ బి రాజశేఖర్‌ తెలిపారు. సమగ్ర సమాచారంతో డైరీని తీసుకొచ్చిన సంఘం నాయకులను అభినందించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ వీరపాండియన్‌, ఎమ్‌డి మనజీర్‌ జిలానితో కలిసి రాజశేఖర్‌ నూతన డైరీని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ.. వ్యవసాయానికి సంబంధించి వివిధ శాఖల్లో విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఈ డైరీలో పొందుపరిచి రైతులకు, కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు ఉపయోగపడే విధంగా ప్రచురించినట్లు తెలిపారు. ఈ డైరీ వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కరదీపికగా ఉంటుందన్నారు. పంటలకు మద్దతు ధరలు, పంటల బీమాలో రైతుల వాటా, బ్యాంకు రుణాలు, కౌలు గుర్తింపు కార్డు పొందడం, ఇ-క్రాప్‌ నమోదు, తదితర అంశాలను డైరీలో వివరించామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్‌, రైతు సంఘం నాయకులు ఎస్‌ మురళీకృష్ణారెడ్డి, కె నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️