- కూర్మన్నపాలెం కూడలిలో 36 గంటల దీక్ష
- విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వామపక్షాల ధర్నాలు
ప్రజాశక్తి – ఉక్కునగరం, కలెక్టరేట్ (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ, అనకాపల్లి జిల్లాలో మంగళవారం నిరసనలు హోరెత్తాయి. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ సెయిల్‌లో విలీనం చేయాలని, ఉద్యోగుల వేతనాలను సకాలంలో చెల్లించాలని, ఈ నెల 8న విశాఖకు వస్తున్న ప్రధాని మోడీ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో 36 గంటల నిరవధిక దీక్షకు ఉక్కు కార్మికులు, వారి కుటుంబీకులు దిగారు. దీక్షను ఉద్దేశించి పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరాం, కెఎం.శ్రీనివాసరావు, డి.ఆది నారాయణ, యు.రామస్వామి, వైటి.దాస్ మాట్లా డారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని, అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను విస్తరించి నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్లాంట్ పరిరక్షణ విషయమై సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లు మోడీపై ఒత్తిడి తేవాలన్నారు. దీక్షలో పోరాట కమిటీ నాయకులు ఎం రాజశేఖర్, కెఎస్‌ఎన్.రావు, నీరుకొండ రామచంద్రరావు, ఎన్.రామారావు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేయాలి : వామపక్షాలు
స్టీల్‌ప్లాంట్ అమ్మకపు నిర్ణయాన్ని రద్దు చేయాలని విశాఖలో వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ‘ఉక్కు’ రక్షణ కోసం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. విశాఖ పర్యటనలోనే ప్రధాని ఉక్కుపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాను ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ ప్రారంభించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ అధ్యక్షత వహించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ళ పైడిరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ ప్రజాపోరు జిల్లా నాయకులు సిహెచ్.దేవా, ఎంసిపిఐ జిల్లా నాయకులు శంకరరావు, ఎస్‌యుసిఐసి రాష్ట్ర నాయకులు ఎస్.గోవిందరాజులు మాట్లాడారు. నాలుగేళ్లుగా ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతుంటే ప్రధానికి పట్టకపోవడం దారుణమన్నారు.