మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్‌

May 20,2024 08:12 #gannavaram, #police arest
  •  శాటిలైట్‌ ఫోన్‌ స్వాధీనం

ప్రజాశక్తి – గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో ఉయ్యూరు లోకేష్‌ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 17వ తేదీ అర్థరాత్రి సిఎం జగన్‌ లండన్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్న సమయంలో ఆయనకు దగ్గరగా అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులు తనిఖీ చేశారు. టికెట్‌ లేకపోవడం, సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటీసు ఇచ్చి శనివారం ఆయనను పంపేశారు. తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయ అధికారుల తనిఖీల్లో లోకేష్‌ నుంచి శాటిలైట్‌ ఫోన్‌ బయటపడింది. దీంతో అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా శాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. శాటిలైట్‌ ఫోన్‌ ఇక్కడ వినియోగించకూడదన్న విషయం తనకు తెలియదని లోకేష్‌ సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నుంచి అఫిడవిట్‌ తీసుకుని పంపేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లోకేష్‌.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు.
సిఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు లోకేష్‌ ప్లాన్‌ : గన్నవరం సిఐ ప్రసాద్‌
విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి సిఎం కాన్వాయిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు సిద్ధపడుతున్నట్టుగా తెలిసి లోకేష్‌ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు గన్నవరం సిఐ ప్రసాద్‌ తెలిపారు. సిఎం రాక సమయంలో గన్నవరం విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనపై శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం… గన్నవరం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు విమానాశ్రయం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, విమానాశ్రయంలో సుమారుగా 60-65 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడం గమనించారు. ఆ వ్యక్తి వివరాలు అడగ్గా.. ఆయన సరైన సమాధానం చెప్పలేదు. సిఎం రాకకు ఏదైనా ఆటంకం కలుగుతుందేమోనని ముందస్తు చర్యలో భాగంగా ఆ వ్యక్తిని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఆయన వద్ద అందుబాటులో ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఆ వ్యక్తి పేరు ఉయ్యూరు లోకేష్‌ బాబు అని, ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్నారని, అమెరికా పౌరసత్వం ఉందని గుర్తించారు. తాను డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు లోకేష్‌ వెల్లడించాడు. ఆయన మొబైల్‌ ఫోన్‌ పరిశీలించగా వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో ‘సిఎం కాన్వాయ్ ని అడ్డుకోవడానికి అందరూ రావాలి’ అని పిలుపునిచ్చిన సమాచారం ఉండడాన్ని గమనించారు. ఈ సమాచారాన్ని వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా, తనకు ఛాతీలో నొప్పి వస్తోందని పోలీసులకు చెప్పడంతో కేర్‌ అండ్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స చేస్తుండగా సహకరించకుండా, తనకు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని కోరారు. ఆయన వయస్సు, అమెరికా సిటిజెన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకుని విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సొంత పూచీకత్తు తీసుకుని కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు అప్పగించారు. అయితే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు, కొట్టినట్లు వివిధ మాధ్యమాల్లో లోకేష్‌ పోస్టులు పెడుతున్నారని, ఇది వాస్తవం కాదని సిఐ వివరణ ఇచ్చారు.

➡️