ఓటమి అంచున మోడీ -ఉత్తరాదినా వ్యతిరేక పవనాలే : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటమి అంచున ఉన్నారని, తాజాగా జరిగిన పోలింగ్‌లో ఉత్తర భారతదేశంలోనూ మోడీ వ్యతిరేక పవనాలు బలంగా వీచాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బిజెపికి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత 15 రోజులుగా ప్రధాని మోడీ ఉపన్యాసాలు వింటుంటే దేశ భవిష్యత్‌ ఏమవుతుందోనని భయమేస్తోందని తెలిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్న మోడీ… దేశంలో వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముస్లిములకు సైతం వెనుకబాటుతనంతో రిజర్వేషన్లు కల్పించబడ్డాయని వివరించారు. మత రిజర్వేషన్లు రద్దు చేస్తే హిందువులకూ రిజర్వేషన్లు ఉండవని, ఈ విషయం బిజెపి కార్యకర్తలకూ తెలుసని అన్నారు. మంగళవారం ఎన్‌టిఆర్‌ జయంతిని జరుపుకున్నారని, రాష్ట్ర హక్కుల కోసం టిడిపిని ఎన్‌టిఆర్‌ స్థాపించారని, లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్‌కు పూలమాలలు వేస్తున్న నాయకులు… ఆయన ఆశయాలను తుంగలో తొక్కారని, దారి తప్పిన టిడిపిని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులే తిరిగి గాడిలో పెట్టాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర హక్కుల గురించి టిడిపిలోనూ, వైసిపిలోనూ మాట్లాడేవారే లేరని విమర్శించారు. జూన్‌లో పింఛన్ల కోసం పడిగాపులు పడేలా చేస్తే క్షమించరాని తప్పిదం అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసకు టిడిపి, వైసిపి ప్రధాన కారణమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. మోడీ చెప్పినట్లు ఇసి ఆడుతోందన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బెయిల్‌పై ఉన్న వారే ముఖ్యమంత్రి అవుతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి, ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత… విదేశీ పర్యటనల్లో మునిగి తేలడం శోచనీయమన్నారు. మరోనేత అసలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయం అంటే ప్రజా సంక్షేమం అని, ఓట్లు, ఎన్నికలే కాదన్న విషయాన్ని ప్రధాన పార్టీల నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. కమ్యూనిస్టులు ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ప్రజా మద్దతు కోరిన ఏకైక పార్టీ సిపిఎం అని స్పష్టం చేశారు. అలాంటి సిపిఎంని కరపత్రాలు తీసుకెళ్తుంటే బిల్లులు లేవని రకరకాల సాకులతో ఇబ్బందులు పెట్టారన్నారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కీలుబమ్మలా వ్యవహరించిందని విమర్శించారు. ప్రస్తుతం అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇద్దరికీ కేసుల భయం పట్టుకుందని, అందుకే మోడీకి తలగ్గారని వివరించారు.
‘ఉపాధి’ పనులు జరిగే చోట హృదయ విదారక ఘటనలు
ఉపాధి హామీ పనులు జరిగే చోట హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వి.శ్రీనివాసరావు అన్నారు. ఉపాధి కార్మికులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని, పని ప్రదేశంలో నీడ లేకపోవడంతో చంటి పిల్లలను సైతం ఎండల్లోనే ఉంచి పనులు చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. రోజంతా కష్టపడినా రూ.200 వేతనం కూడా దక్కడం లేదన్నారు. ఉపాధి కార్మికులకు కనీస వేతనం రూ.400 ఇవ్వాలని, వైద్య సౌకర్యం, పనిచేసే చోట కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య పాల్గొన్నారు.

➡️