అంగన్‌వాడీ ఆశా వర్కర్ల కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు

  • ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులకు వేలం వేసి డబ్బులు చెల్లించలేదని గ్రామ బహిష్కరణ చేసిన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బొరుబద్ర పిహెచ్‌సి, గెద్దలపాడు గ్రామపెద్దలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. గెద్దలపాడు గ్రామంలో సత్తు చంద్రమ్మ 2014 నుండి ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నారని, రూ.10 వేలు ఆదాయంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకూ గ్రామ ప్రజలు, పిహెచ్‌సి అధికారుల నుండి చంద్రమ్మపై ఎటువంటి ఫిర్యాదులూ లేవని తెలిపారు. ఆశా వర్కర్‌గా పనిచేయాలంటే రెండు లక్షల రూపాయలకు వేలం పాటపాడి గ్రామ పెద్దలకు చెల్లించాలని గత ఎనిమిది నెలలుగా చంద్రమ్మను వేధిస్తున్నారని తెలిపారు. ఆగస్టు నెలలో ఈ సమస్య మొదలైందని, దీనిపై ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రెండు లక్షలు చెల్లించనిపక్షంలో రాజీనామా చేయాలని చంద్రమ్మపై తీవ్ర ఒత్తిడి తెస్తుంటే మానసిక ఒత్తిడికి గురవుతూ ఆమె పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 17 నుండి విధులకు హాజరుకావద్దని దండోరా వేయించారని, గ్రామంలో ఎవరూ ఆమెకు సాయం అందించకూడదని, మందులు ఇవ్వరాదని అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే గ్రామంలో గత పదేళ్లుగా అంగన్‌వాడీ సెంటర్లో ఎన్‌.హరిదేవి(వర్కరు), ఎం.గారమ్మ(హెల్పర్‌) పనిచేస్తున్నారని, వారినీ రెండు లక్షలు చెల్లించాలని బెదిరించారని పేర్కొన్నారు. లేనిపక్షంలో విధులకు హాజరు కావద్దని చెబుతూ పిల్లలను కూడా వారి కేంద్రానికి పంపించడం లేదని తెలిపారు. ఈ అనాగరికమైన చట్ట విరుద్ధమైన గ్రామ పెత్తందార్ల చర్యలపై వెంటనే జోక్యం చేసుకుని వేధింపులు నిలుపుదల చేయించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశావర్కర్‌ గ్రామంలో విధులు నిర్వహించడానికి అంగన్‌వాడీ సెంటర్‌ను తెరిపించి వర్కరు, హెల్పరు గ్రామంలో విధులు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూడాలని కోరారు. వేలంపాటవేసి డబ్బు చెల్లించాలని వేధించిన వారిపైనా, గ్రామ బహిష్కరణ చేసినవారిపైనా చర్యలు తీసుకోవాలని, చంద్రమ్మ, హరిదేవి, గారమ్మ కుటుంబాలకు రక్షణ కల్పించాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు.

➡️