ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి

Jan 10,2025 23:39 #be filled, #immediately, #vacancies
  • స్త్రీ, శిశుసంక్షేమ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్‌వాడీలు
  • వెంటనే చర్యలు తీసుకుంటాం : పిడి

ప్రజాశక్తి-గుంటూరు : ఖాళీలను భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ పీడీ కార్యాలయాలన్ని అంగన్‌ వాడీలు ముట్టడించారు. ఖాళీలు భర్తీ చేయాలని, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌.రేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు ఖాళీలు గుర్తించి, భర్తీ చేస్తుంటే గుంటూరు జిల్లాలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దాదాపు 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, హెల్పర్లలో ఒక్కరే పనిచేస్తున్నారని, దీంతో పనిభారం పెరుగుతుందని తెలిపారు.
తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీ మేరకు వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్‌ బెన్‌ఫిÛట్స్‌, మట్టిఖర్చులు ఇవ్వాలని కోరారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ స్పందింస్తూ…ఖాళీల భర్తీకి, హెల్పర్ల ప్రమోషన్లకు వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇతర సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవిఎన్‌.కుమారి, దీప్తి మనోజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

➡️