వల్లభనేని వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటాం : విజయవాడ సీపీ

విజయవాడ : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటామని, దీని కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ … ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపైనా దృష్టిపెట్టామని చెప్పారు. టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ఈ కేసును పకడ్బందీగా డీల్‌ చేస్తున్నామని సీపీ తెలిపారు. వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకొచ్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నగరంలోని జిల్లా జైలుకు తరలించారు.

➡️