ప్రజాశక్తి-అమరావతి : గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 16కి వాయిదా పడింది. ఇదే అంశంపై మరో నిందితునిపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేయడంపై విజయవాడ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన కేసును కూడా బెయిల్ పిటిషన్‌తో జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. రెండింటినీ కలిపి విచారిస్తామని జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం ప్రకటించారు. గన్నవరం టిడిపి ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేసే సత్యవర్థన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా వంశీని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు ఎస్‌సి ఎస్‌టి చట్టం కింద నమోదు చేసిన కేసులోను బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు.
