- ప్రధాని మోడీ ప్రభృతుల సంతాపం
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య (85) శనివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. రాత్రి నిద్రించిన ఆయన ఉదయం విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్‌ఎంపికి చూపించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలంగా రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య, జానకమ్మ దంపతులు చరిత్ర సృష్టించారు. మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే ప్రచారం చేశారు. మొక్కల కోసం దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య జీవితాన్నే త్యాగం చేశారు. దరిపల్లి రామయ్య కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 మార్చి 30వ తేదీన పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వనజీవి రామయ్య అవార్డు అందుకున్నారు. రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షిత రక్షత్ణ’ అనే నినాదాన్ని రామయ్య, జానకమ్మ దంపతులు తమ తలపాగాగా ధరించి పర్యావరణ హితం కోసం పాటుపడ్డారని ప్రధాని కొనియాడారు.