వెలిగొండకు మరో రూ.2500 కోట్లు అవసరం

  • నిర్వాసితులకు దక్కని ప్యాకేజీ
  • రెండేళ్లలో నీరిస్తామన్నా ఇరిగేషన్‌ మంత్రి

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ప్రారంభించారు. నిర్వాసితులకు ప్యాకేజీలు, పునరావాసం, కాలువల పనులతో పాటు సొరంగాల నిర్మాణాలు అనేకం అసంపూర్తిగానే ఉన్నాయి. వాటిని పక్కనబెట్టి హడావుడిగా ప్రారంభించారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కనీసం రూ.2500 కోట్లకుపైగానే నిధులు అవసరమవుతాయని అంచనా.
ఇటీవల వెలిగొండ ప్రాజెక్టును, దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని రెండో టన్నెల్‌ను ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రత్యేక వాహనాల్లో సొరంగం లోపలికి వెళ్లి ప్రాజెక్టు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞంగా మార్చుకున్నాయని విమర్శించారు. ఇప్పటి వరకూ ఖర్చు చేసింది పోను ఇంకా రూ.2500 కోట్ల వరకూ నిధులు అవసరమవుతాయని తెలిపారు. ప్రాజెక్టుకు 2014-19 మధ్య రూ.1373 కోట్లు కేటాయించారు. రూ.1319 కోట్లు ఖర్చుపెట్టారు. గత వైసిపి ప్రభుత్వంలో 2019-24 మధ్య రూ.3 వేల కోట్లు కేటాయించి రూ.174 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. గతంలో ఉన్న పెండింగ్‌ పనులకు చేసిన చెల్లింపులను చెల్లించలేదు. దీంతో, చేసిన ఖర్చు తక్కువగా ఉంది. ఈ విషయాన్ని చూపేందుకు పాత పనులకు చేసిన చెల్లింపులను వ్యూహాత్మకంగా ఖర్చులో కలపలేదు. ఇక నిర్వహణకు ఏటా రూ.980 కోట్లు కేటాయించాల్సి ఉండగా ఐదేళ్లలో రూ.225 కోట్లు కేటాయించారు. దీంతో నిధుల సమస్యతోనే ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.

ప్యాకేజీ కోసం నిర్వాసితుల ఎదురుచూపులు

11 ముంపు గ్రామాల్లో నిర్వాసితులు 7 వేల మంది వరకూ ఉన్నారు. ఒక్కొక్కరికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంటు కింద రూ.12.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే అప్పటి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికీ నిర్వాసితులు తమకు ప్యాకేజీలు ఇస్తే అక్కడ నుంచి బయటకు వస్తామని అంటున్నారు. వీరికి సుమారు రూ.900 కోట్ల వరకూ అవసరమవుతాయి.

అసంపూర్తిగా ప్రాజెక్టు పనులు

వెలిగొండ ప్రాజెక్టులో అనేక పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వాటిని పూర్తిచేయడానికి కనీసం ఏడాదికి పైగానే పడుతుందని సమాచారం. ప్రధానంగా చూస్తే హెడ్‌ రెగ్యులేటర్‌ గోడ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. సొరంగాలను మిషన్‌తో కాకుండా మాన్యువల్‌గా తవ్వకాలు చేశారు. మట్టిని సొరంగాల్లోనే చివర పోశారు. 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అక్కడుంది. దీన్ని బయటకు తరలించాల్సి ఉంది. మొదటి సొరంగంలోనే 6.80 కిలో మీటర్ల పొడవున లైనింగ్‌ వేయాల్సి ఉంది. ఈ పనులు ఎంత వేగంగా చేపట్టినా ఏడాదికి పైగానే సమయం పడుతుంది. పునరావాసానికి రూ.880 కోట్లు కేటాయించాలి. 11 ముంపు గ్రామాలున్నాయి. వాటిలో కేవలం 5 గ్రామాల నిర్వాసితులకు చెందిన పునరావాసం కాలనీల్లోనే కనీస సౌకర్యాలు కల్పించారు. మిగతా 6 కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కాలువలు ఎప్పుడో పదేళ్ల క్రితం తవ్వారు. అవన్నీ శిథిలమయ్యాయి. నిర్మాణాలు సరిగా లేవు. వాటిని సరిచేయాల్సి ఉంది.

సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోతాం : మంత్రి స్వామి

వెలిగొండ ప్రాజెక్టుపై మరోసారి సమీక్ష చేసి ఎన్ని నిధులు అవసరమవుతాయో తేల్చాక సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోతామని జిల్లా మంత్రి డాక్టర్‌ డోలా వీరాంజనేయస్వామి తెలిపారు. వెలిగొండ పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు.

➡️