మాపై వైసిపి దుష్ప్రచారం : వేమిరెడ్డి దంపతులు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నిన్నటికి నిన్న మేము పార్టీ మారుతున్నట్టు వైసిపి వారు ఓ దుష్ప్రచారం చేశారని, ఈ రోజు ఇంకో ప్రచారం చేసి వికృతానందం పొందుతున్నారని నెల్లూరు పార్లమెంటు ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆమె భర్త కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వైసిపికి, ఆ పార్టీ నాయకు లకు ప్రజలు తగ్గిన బుద్ధి చెబుతారని అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, నార్త్‌ రాజు పాలెంలో వారు కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. వైసిపి నాయకులు విజయసాయిరెడ్డి, ప్రసన్నకుమార్‌ రెడ్డి, రాజేంద్రరెడ్డి తదితరులు తమపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తనను ప్రకటించినప్పటి నుంచి ఇలాంటి ఫేక్‌ ప్రచారాలు అనేకం చేశారని వివరించారు. ఢిల్లీ నుంచి ఎంపి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చిన విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు ఏం చేశారో చెప్పి ఓట్లు అభ్యర్థించాలని డిమాండ్‌ చేశారు. ఒక మహిళా అభ్యర్థికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే ఓర్చుకోలేక, ఓటమిని అంగీకరించలేక ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంత మాత్రం తగదని చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిపై పోటీకి సరైన నాయకుడు లేక వైజాగ్‌ నుంచి దిగుమతి చేసుకున్న విజయసాయిరెడ్డి.. ఈ రోజు పిచ్చిపిచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శిస్తున్నారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేము పార్టీ మారి నప్పటి నుంచి వైసిపి నాయకులు చీప్‌ పాలిటిక్స్‌ ఆడుతున్నారని విమర్శించారు. ఓడిపోతామన్న భయంతో ఏవేవో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

➡️