ప్రజాశక్తి- గన్నవరం :దేశానికి చీడలా బిజెపి మారిందని , రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలో ఆ చీడను తగిలించుకొని, తిరిగి ప్రజలకు అంటించాలని చూస్తున్నాయని, ఓటు అనే మందుతో ఆ నాలుగు పార్టీలకు పట్టిన చీడను వదిలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయకపోతే దేశం, రాష్ట్రం సర్వనాశనం అవుతాయని పేర్కొన్నారు. ఇండియా వేదిక సిపిఐ,కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు, మచిలీపట్నం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కఅష్ణ బుధవారం గన్నవరం పట్టణంలో ఉదఅతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వామపక్ష, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గని సందడి చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ..
పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఆంద్రాకు ఇచ్చిందేమీ లేదన్నారు. పునర్విభజన చట్టంలోని ఏ అంశాలను అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హౌదా ఇవ్వనందుకు, విశాఖకు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైనందుకు, పోలవరం కట్టకుండా వదిలేసినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గం చైతన్యవంతమైనదని, ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవోద్యమ నాయకులు ఇక్కడ నుంచీ పోరాటాలు చేశారని తెలిపారు. మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య, అట్లూరి శ్రీమన్నారాయణ, మానికొండ సూర్యవతి, సిఎల్ రాయుడు, చింతపల్లి పాపారావు, లక్ష్మారాయుడు, ఇరుగు నోబుల్ వంటి వారలు ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు నడిపినట్లు గుర్తు చేశారు. వారి ఆశయాల మార్గంలో నడుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ, టిడిపి పార్టీలు ఒకరికి ముగ్గురు తిట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివఅద్ధిని పూర్తిగా విస్మరించిన వైసీపీ గుణపాఠం చెప్పాలన్నారు.
సిపిఎం అభ్యర్థి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి కఅష్ణ మాట్లాడుతూ…
బిజెపి రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించాలన్నదే మోదీ కుట్ర అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయన్నారు. కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందో మోదీ సమాధానం చెప్పాలన్నారు. దానిని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. దళితులు, బడుగు బలహీనవర్గాలపైన మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తాడని, రిజర్వేషన్లపై మాట్లాడిన వారి పైకి పోలీసులు పంపుతున్నారని పేర్కొన్నారు. వ్యతిరేకంగా ప్రజలంతా ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలన్నారు. ఇండియా వేదిక దేశంలో అధికారంలోకి వస్తుందని, తద్వారా దేశంలోని ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. రఘు, మల్లంపల్లి ఆంజనేయులు, పార్టీ నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, ఏసుదాసు, మల్లంపల్లి జయమ్మ, మీరా ఖాన్, దాసి బాబురావు, బాబావాలి, టీవీ లక్ష్మణ స్వామి తదితరులు పాల్గన్నారు.
