రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

May 14,2024 11:27 #press meet, #Venugopal Reddy

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ”గుంటూరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాం.. దొంగ ఓట్లు మీద ఎలాంటి ఫిర్యాదు మాకు అందలేదు.. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.. పోలింగ్‌ అనంతరం, పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌ రూములకు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక, రాబోయే 20 రోజులు స్ట్రాంగ్‌ రూమ్‌ లోని ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం.. కౌంటింగ్‌ జరిగే వరకు ఈవీఎంలకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశాం.” అని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి వెల్లడించారు.
కాగా, ఈవీఎంల భద్రత కోసం మూడు అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి చెప్పారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు, సివిల్‌ పోలీసులు కూడా ఈవీఎంలకు భద్రతగా ఉంటారు.. ఈవీఎంల భద్రత గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని వెల్లడించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల దగ్గర సీసీ కెమెరాలు అమర్చాం.. సీసీ కెమెరాల లైవ్‌ లింకులను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఓ ప్రత్యేక భవనంలో అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో పెడతాం.. ఎవరు కావాలన్నా అక్కడ లైవ్‌ టెలికాస్ట్‌ చూడవచ్చు అని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.

➡️