టిడిపి కార్యాలయంపై దాడి కేసులో 4న తీర్పు

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైసిపి మాజీ ఎంపీ నందిగం సురేష్‌, సానుభూతిపరుడు అవుతు శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిశాయి. దీంతో ఈ నెల 4న తీర్పు వెలువరిస్తామని జస్టిస్‌ విఆర్‌ కె.కృపాసాగర్‌ మంగళవారం ప్రకటించారు. పోలీసుల తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లూథ్రా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదించారు. నందిగం విచారణకు సహకరించడం లేదని, దాడి ఘటన వెనుక సురేష్‌ హస్తం ఉందని చెప్పారు. ఇతర నిందితులను గుర్తించేందుకు నందిగం ఫోను స్వాధీనం చేసుకోవాల్సివుందన్నారు. తన రెండు ఐఫోన్లు పోయాయని చెబుతున్న నందిగం ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. వాట్సప్‌ మెసేజ్‌లు పరిశీలించాల్సి ఉందన్నారు. దాడి వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో తేల్చాలన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ, సహ నిందితుల వాంగ్మూలం తప్ప ఘటనలో నందిగం ప్రమేయానికి సంబంధించి ఆధారాలేమీ చూపలేదన్నారు. పోలీస్‌ కస్టడీ కూడా ముగిసిందని, జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాదనలు ముగియడంతో ఈ నెల 4న తీర్పు చెబుతామని హైకోర్టు ప్రకటించింది.

➡️