జత్వానీ కేసులో విద్యాసాగర్‌కు బెయిల్‌

ప్రజాశక్తి-అమరావతి : సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో వ్యాపారవేత్త కె విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను సోమవారం మంజూరు చేసింది. బెయిల్‌ మంజూరు చేయవద్దన్న సిఐడి, జత్వానీ వాదనలను తిరస్కరించింది. తన ఆధార్‌ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను విద్యాసాగర్‌ ఫోర్జరీ చేశారంటూ జత్వానీ గత సెప్టెంబర్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కింది కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో విద్యాసాగర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ విఆర్‌కె కృపాసాగర్‌ తీర్పు చెప్పారు. పోలీసుల విచారణలో సాక్షులు పలు విషయాలను మార్పు చేస్తూ చెప్పారని గుర్తు చేశారు. సాక్షుల నుంచి సేకరించిన ఆధారాల విశ్వసనీయతపై సందేహం ఉందన్నారు. గత 77 రోజులుగా పిటిషనర్‌ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. రూ.50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, ప్రతినెలా 1, 15వ తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, 3 నెలలు లేదా చార్జిషీట్‌ వేసే వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని.. ఇతర షరతులను విధిస్తూ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు చెప్పారు.

➡️