ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామనిమంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసిపి హయాంలో అనే అక్రమాలు జరిగాయని టిడిపి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సభ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఇన్‌ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
