ప్రజాశక్తి-అమరావతి : ప్రభుత్వ వ్యతిరేక సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా పోలీసులు నమోదు చేస్తున్న కేసులు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతి రేకమంటూ జర్నలిస్ట్ పోలా విజయ్ బాబు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలీసులపై విచారణకు ఆదేశించాలంటూ పిల్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ఇది రాజకీయ ప్రేరిత వ్యాజ్యమని తేల్చింది. కోర్టు ఖర్చుల కింద విజయ్ బాబుకు రూ.50 వేలు జరిమానా విధించింది. నెలరోజుల్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు ఆ మొత్తాన్ని చెల్లించాలని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. బెదిరింపులకు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. బాధితులు కోర్టుకు రావాలేగానీ సంబంధం లేని వాళ్లు కోర్టులో పిల్‌వేయడం కుదరదని చెప్పింది.