వరద బాధితులపై దౌర్జన్యం సరికాదు

  • ముంపు ప్రాంతాలను గుర్తించాలి : సిపిఎం బాబూరావు
  • కుమ్మరిపాలెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (విజయవాడ) : వరదలో మునిగిపోయిన కొన్ని ప్రాంతాలను గుర్తించకపోవడం సరికాదని, న్యాయం చేయాలని కోరిన బాధితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. దీనికి టిడిపి, బిజెపి కూటమి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలన్నారు. వరద బాధితులందరి పేర్లు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ కుమ్మరిపాలెం, భవానీపురం కృష్ణాకరకట్ట ప్రాంత వరద బాధితులను బాబూరావుతోపాటు సిపిఎం విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు తదితరులు మంగళవారం పరామర్శించారు. ఆయా ప్రాంతాల్లోని వరద బాధితులతో మాట్లాడారు. ఓ వైపు కృష్ణానది, మరోవైపు బుడమేరు వరదలతో 38వ డివిజన్‌ పూర్తిగా మునిగినా, దానిని ముంపు ప్రాంతంగా ప్రభుత్వం, అధికారులు గుర్తించలేదని సిపిఎం నేతల ఎదుట బాధితులు వాపోయారు. స్థానిక శాసనసభ్యులకు ఈ విషయం ముందే చెప్పినా పట్టించుకోలేదని, గత్యంతరం లేక ఆందోళన చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేయించడం అన్యాయమని ఆవేదన వెలిబుచ్చారు. బాబురావు, సత్యబాబు మాట్లాడుతూ.. వరద వచ్చి 24 రోజులైనా బాధితులకు ఇంకా న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు. వరద ప్రాంతాల గుర్తింపులో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వరద బాధితులందరికీ న్యాయం చేయాలని, అందరి పేర్లూ నమోదు చేసుకోవాలని, ప్రభుత్వ సాయం అందరికీ అందించాలని డిమాండ్‌ చేశారు.

➡️