ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఆందోళన ఉధృతం చేయనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 1327 రోజులకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ప్లాంట్ ఎల్‌ఎంఎం, డబ్ల్యుఆర్‌ఎం, ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం, ఎస్‌బిఎం, ఆర్‌ఎస్ అండ్ ఆర్‌ఎస్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ, ఉక్కు పరిరక్షణ కోసం అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు చేపడతాయని, 2న ఉక్కు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని ఉక్కు దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున దీక్షలు నిర్వహిస్తామని, 3న రైతు సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దీక్షల్లో ఎఐటియుసి నాయకులు మసేన్‌రావు, జె రామకృష్ణ, కె రాజబాబు, డి దేముడు, సీతారామరాజు, ఆర్ ధనరాజు, రాజేశ్వరరావు, మోహన్‌కుమార్, కర్రి బాబూరావు, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
