ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ అధ్వరం ఎంవిపి కాలనీ లోని, గాది రాజు ప్యాలస్ వేదికగా నిర్వహిస్తున్న క్రెడాయ్ 10 వ ప్రాపర్టీ ఎక్స పో రెండవ రోజు కార్యక్రమాల లో భాగంగా ‘స్మార్ట్ సిటీ వైజాగ్ అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధర ప్రసాద్, విఎంఅర్డిఎ కమిషనర్ కె.ఏస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె. మాయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధర ప్రసాద్ మాట్లాడుతు స్వర్ణాంధ్ర 2027లో భాగంగా విశాఖ జిల్లా ప్రాథమిక, మాధ్యమిక రంగాల్లో 15 శాతం వృద్ధిరేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వాటాను ప్రస్తుతమున్న రూ.4.5 లక్షల కోట్ల నుంచి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు జిల్లా ఆర్థిక, మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన రోడ్ మ్యాప్ ను వివరించారు. ఈ ప్రాంతానికి అనుగుణంగా ఉద్యాన, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించామన్నారు. ప్రాథమిక రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్, చేపల ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు అభివృద్ధి ద్వితీయ రంగాన్ని నడిపిస్తుందని చెప్పారు.సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, “క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన అనుమతుల కోసం మేము సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టాము. ఈ చొరవ వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో వృద్ధి పెట్టుబడులను వేగవంతం చేస్తుందని అన్నరు .
వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ప్రాజెక్టుల కింద పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. అడ్వెంచర్ స్పోర్ట్స్, కన్వెన్షన్ స్పేస్ లకు సౌకర్యాలు కల్పించడం ద్వారా టూరిజాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని, పర్యాటకులు ఇక్కడ ఎక్కువ సమయం గడిపేలా చూడాలన్నారు.
జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ భూవివాదాల పరిష్కారానికి, భూ నిర్వహణకు కృషి చేయాలన్నారు. డ్రోన్, రోవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కచ్చితమైన రీసర్వే నిర్వహించి క్లాజ్ 22(ఏ) ప్రక్రియలను మెరుగుపరుస్తున్నాం. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం (పీజీఆర్ఎస్) కూడా అక్రమార్కులపై సత్వర చర్యలు తీసుకునేలా చూస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో క్రెడాయ్ విశాఖ చాప్టర్ అధ్యక్షుడు వి.ధర్మేందర్ , చైర్మన్ కె.ఎస్.ఆర్.కె.రాజు (సాయి), గౌరవ కార్యదర్శి వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.