విశాఖ ఉక్కును కేంద్రమే నడపాలి

ప్రజాశక్తి- సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : విశాఖ స్టీలు ప్లాంటును కేంద్రమే నిర్వహించాలని, ప్రైవేటీకరించొద్దని, సొంత గనులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర 27వ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. గత ఎన్నికల ముందు టిడిపి, జనసేన నాయకులు ఈ మేరకు వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పుట్టని ఆర్సెల్లార్‌ మిట్టల్‌కు గనులు ఇవ్వాలని కోరారేగానీ, విశాఖ స్టీలుకు ఇవ్వాలని కోరలేదని తీర్మానంలో పేర్కొన్నారు. నెల్లూరులోని సీతారాం ఏచూరి నగర్‌ (అనిల్‌ గార్డెన్స్‌)లో జరుగుతున్న సిపిఎం 27వ మహాసభ రెండో రోజు పలు అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. కడపలో స్టీలు ప్లాంటు, పేదలందరికీ సమగ్ర భూ పంపిణీ, కార్మికులకు కనీస వేతనాలు, రెగ్యులరైజేషన్‌, సంక్షేమ పథకాలు అమలు వంటివి వాటిలో ఉన్నాయి. పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు ఆపాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటీకరణ ఆపాలని, దళితులపై దాడులు అరికట్టాలని ప్రవేశపెట్టిన తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లతో కుమ్మకై భూములను, గనులను, భారీ పరిశ్రమల సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని, ఇటువంటి ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని సిపిఎం రాష్ట్ర 27వ మహాసభ డిమాండ్‌ చేసింది. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జిల్లాకు చెందిన కెఎం.శ్రీనివాస్‌ తీర్మానం ప్రవేశపెట్టగా తిరుపతి జిల్లాకు చెందిన నాగరాజు బలపరిచారు. దీన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రైవేటీకరణలో భాగంగానే విశాఖ స్టీలులో నూరు శాతం వాటాలు అమ్మాలని 2021 జనవరిలో కేంద్ర కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లతో కుమ్మకై కారు చౌకగా ఈ ప్లాంట్‌ను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇటువంటి ప్రయత్నాలు విరమించుకుని కేంద్రమే నిర్వహించాలని మహాసభ డిమాండ్‌ చేసింది. సాలీనా 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే నాణ్యమైన స్టీలును ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీలును అభివృద్ధి చేయాల్సిందిపోయి అమ్మాలని చూడడం సరికాదని పేర్కొంది. విశాఖ స్టీలును ప్రైవేటుపరం కాకుండా ఆపుతామని టిడిపి, జనసేన పార్టీలు వాగ్దానం చేశాయని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంకా పుట్టని ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీలుకు సొంత గనులు కేటాయించాలని ప్రధానిని కోరారేగానీ, విశాఖ స్టీలుకు గనులు కోరకపోవడం దుర్మార్గమని తెలిపారు. జనవరి 8న విశాఖ వచ్చిన మోడీ… స్టీల్‌ ప్లాంటుపై మాట్లాడలేదని, దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అర్థమవుతోందని వివరించారు. యాజమాన్యం కార్మికులకు, అధికారులకు విఆర్‌ఎస్‌ ప్రకటించిందని, నాలుగు వేల మంది కార్మికులకు తొలగించేందుకు సన్నద్ధమైందని తీర్మానంలో పేర్కొన్నారు. ముడి ఇనుప ఖనిజం, కోకింగ్‌ కోల్‌ గంగవరం పోర్టు నుండి విశాఖ స్టీలుకు రాకుండా అదాని పోర్టు యాజమాన్యం అనేకసార్లు అడ్డుపడుతూనే ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వంపై టిడిపి కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడాన్ని మహాసభ తీవ్రంగా ఖండించింది.

సెయిల్‌ ఆధ్వర్యంలో కడప స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణం

ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూలు 13లో కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నేటికీ శిలాఫలకాలకే పరిమితమైందని మహాసభ పేర్కొంది. కడప స్టీలు ఫ్యాక్టరీ నిర్మించాలని మహాసభ మరొక తీర్మానాన్ని ఆమోదించింది. రాయలసీమ డిక్లరేషన్‌ పేరిట బిజెపి ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలులో ప్రకటించిందని గుర్తు చేసింది. తొలుత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎట్టిమట్టిచంతల వద్ద, అనంతరం చంద్రబాబునాయుడు కంబాలదిన్నె వద్ద శంకుస్థాపనలు చేశారని పేర్కొంది. మూడోసారి జగన్‌ ముచ్చటగా కన్నెతీర్థం వద్ద శంకుస్థాపన చేశారని వివరించింది. సెయిల్‌ చైర్మన్‌ తొలుత కడప ఫీజుబిలిటీ అని నివేదిక ఇచ్చారని, బిజెపి ఒత్తిడితో నాన్‌ ఫీజుబిలిటీ అని రిపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు. కడప ఉక్కు ఫీజుబిలిటీపై జాయింట్‌ పార్లమెంటరీ పబ్లిక్‌ హియరింగ్‌ పెట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి కావాల్సిన ఇనుప ఖనిజం కడప, అన్నమయ్య, అనంతపురం, బళ్లారి జిల్లాల్లోనే ఉందని తీర్మానం తెలిపింది. వెంటనే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని తీర్మానం కోరింది.

కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి

రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని సిపిఎం మహాసభ డిమాండ్‌ చేసింది. కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఆర్‌వి.నరసింహారావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రసాదు బలపరిచారు. రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు పరిశ్రమలు, మిల్లులు, షాపులు, రవాణా, హాస్పిటల్స్‌, విద్యా సంస్థలు తదితర షెడ్యూలు ఎంప్లాయిమెంట్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. వేతన సవరణ బోర్డును వేసి మూడు దఫాలుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను పరిగణనలోకి తీసుకుని వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహాసభ తీర్మానించింది.

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వెలుగు, ఉపాధి హామీ, సమగ్ర శిక్ష, కస్తూరిబా, వెల్ఫేర్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, 108, 104 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, ఆయుష్‌, ఎన్‌టిఆర్‌ వైద్యసేవ, అర్బన్‌ హెల్త్‌ పథకాల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు. అన్ని క్యాడర్ల స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వోద్యోగులకు గుర్తించాలని, స్కీమ్‌ వర్కర్లకు డిఎ సౌకర్యం కల్పించాలని మహాసభ ఆ తీర్మానంలో కోరింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు రంగాల్లో 50 వేలమంది పనిచేస్తున్నారు. , వీరందరినీ పర్మినెంట్‌ చేయాలని మహాసభ డిమాండ్‌ చేసింది. 12వ పే రివిజన్‌ కమిషన్‌ను వెంటనే నియమించాలని, ఉద్యోగ సంఘాలు కోరుతున్న విధంగా 30 శాతం మధ్యంతర భృతి కల్పించాలని, హమాలీ, ఆటో, లారీ కార్మికులకు సంక్షేమ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది. భవన నిర్మాణ బోర్డులో నిలుపుదల చేసిన పథకాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని మహాసభ కోరింది.

పట్టణాల్లో పన్ను పెంపు ఆపాలి

కేంద్ర ఆర్థిక సంఘం నిధులన్నీ ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలకు ముడిపెట్టి పన్నులు పెంచుతున్నారని, ఈ నిర్ణయాన్ని ఆపాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటీకరణ విడనాడాలని మరొక తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదింది. దీన్ని డి.కాశీనాథ్‌ ప్రవేశపెట్టగా టి.రాముడు బలపరిచారు. ప్రపంచ బ్యాంకు ఆదేశిత కేంద్ర బిజెపి పట్టణ సంస్కరణల అమలుకు రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం సిద్ధపడడాన్ని మహాసభ తీవ్రంగా వ్యతిరేకించింది. పిపిపి పేరుతో స్థానిక సంస్థల ఆస్తులను బడా సంస్థలకు ధారాదత్తం చేస్తోందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తదితర అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. గతంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మోడీకి లొంగిపోయి ప్రమాదకర విధానాలను అమలు చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పన్నును రద్దు చేయకపోగా, అమృత్‌ పథకం సంస్కరణలు ద్వారా నీటి కుళాయిలకు మీటర్లు, నీటి ఛార్జీలు, భూగర్భ డ్రెయినేజీ ఛార్జీల పెంపునకు ప్రయత్నిస్తోందని, నీటి పంపిణీ వ్యవస్థను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుంటోందని తీర్మానం పేర్కొంది. పన్ను భారాలు, యూజర్‌ ఛార్జీల విధింపు, మౌలిక సదుపాయాలు, పౌరసేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమించాలని ఆ తీర్మానం విజ్ఞప్తి చేసింది.

సమగ్ర భూ పంపిణీ ద్వారానే పేదరిక నిర్మూలన

భూసంస్కరణలు అమలు జరిగి పేదల చేతికి భూమి వచ్చి నీటి సౌకర్యం లభించిన చోట పేదరిక నిర్మూలన జరిగిందని, ఆ విధంగా సమగ్ర భూ పంపిణీ చేయాలని సిపిఎం మహాసభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని దడాల సుబ్బారావు ప్రవేశపెట్టగా అన్వేష్‌ బలపరిచారు. మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దున్నేవాడికే భూమి కావాలని వెట్టిచాకిరీ, కులమతాలు లేని సమాజం కావాలని, ఎర్రజెండా నాయకత్వంలో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ద్వారా నాలుగు వేల మంది ప్రాణాలు అర్పించి మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాలు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల బంజరు, మిగులు భూములు పేదలకు పంచామని చెబుతున్న భూముల్లో 15 లక్షల ఎకరాలు తిరిగి భూస్వాములు, పలుకుబడి కలిగినవారు అక్రమంగా, దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని మహాసభ పేర్కొంది. పోరాడిన వారిపై అధికార పార్టీలు నిర్బంధం ప్రయోగించి 1200 మందిపై కేసులు బనాయించారని, 120 మందిని జైలుకు పంపించారని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిషన్‌ రాష్ట్రంలో భూమిలేని పేదలకు కనీసం ఎకరం చొప్పున పంచడానికి భూమి ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. 2007లో జరిగిన భూ పోరాటం సందర్భంగా ముదిగొండ పోలీసు కాల్పుల్లో ప్రభుత్వం ఏడుగురిని పొట్టన బెట్టుకుంది. ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి కొంతమందికైనా భూములు పంచింది. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ చేయకపోగా, భూ చట్టాలన్నిటినీ నీరుగార్చి పేదల భూములను పెద్దలకు కట్టబెడుతున్నారని ఈ తీర్మానం తెలిపింది. మరోవైపు కార్పొరేట్‌ కంపెనీలు పరిశ్రమలు పెట్టకుండానే తీసుకున్న భూములను తాకట్టుపెట్టి రుణాలు తీసుకుని ఎగ్గొట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయని తీర్మానం వివరించింది. పోరాడితేనే భూమి దక్కుతుందని, పేదలను చైతన్యపరిచి భూమి కోసం పోరాడడానికి ప్రజలను సన్నద్ధం చేయాలని సిపిఎం మహాసభ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేసి భూమిలేని ప్రతి కుటుంబానికీ రెండు ఎకరాల భూమి, గ్రామాల్లో ఐదు, పట్టణాల్లో మూడు సెంట్ల నివాస స్థలం పంపిణీ చేయాలని మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. బలవంతపు భూసేకరణ ఆపాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని తీర్మానించిది.

➡️